Sunetra Pawar for Dy CM Maharashtra : మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం తర్వాత.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. ‘దాదా’ (అజిత్ పవార్) లేని లోటును ఎవరూ పూడ్చలేరని భావిస్తున్న తరుణంలో, ఎన్సీపీ (అజిత్ వర్గం) నాయకత్వం ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో వారసత్వ పోరుకు తావివ్వకుండా, సానుభూతి పవనాలను అందిపుచ్చుకునేలా.. అజిత్ పవార్ సతీమణి, రాజ్యసభ సభ్యురాలు సునేత్ర పవార్‌ను తెరపైకి తెస్తున్నారు. ఆమెను కేవలం పార్టీ బాధ్యతలకే పరిమితం చేయకుండా.. ఏకంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. భర్త మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానం నుంచే ఆమెను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్సీపీ అగ్రనేతలు, బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతుండటం మహా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.
ఏకగ్రీవంగా సునేత్ర వైపే మొగ్గు : అజిత్ పవార్ మరణంతో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే దానిపై ఎన్సీపీలో అంతర్గత మథనం జరిగింది. అయితే, పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు కుటుంబ సభ్యులే సరైనవారని సీనియర్లు భావిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలైన ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, ధనంజయ్ ముండే, సునీల్ తత్కరే వంటి ఉద్ధండులు ఇప్పటికే సునేత్ర పవార్‌తో వరుస భేటీలు జరిపారు. ఆమెకు రాజకీయ అనుభవం ఉండటం, ప్రస్తుత విషాద పరిస్థితుల్లో ప్రజల్లో ఆమె పట్ల సానుభూతి ఉండటం పార్టీకి కలిసొచ్చే అంశాలుగా వారు భావిస్తున్నారు. అందుకే ఆమెను డిప్యూటీ సీఎంగా ప్రతిపాదించేందుకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఫడ్నవీస్‌తో భేటీకి రంగం సిద్ధం : ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తెచ్చేందుకు ఎన్సీపీ నేతలు వడివడిగా పావులు కదుపుతున్నారు. సునేత్ర పవార్‌ను డిప్యూటీ సీఎంగా చేయడానికి ఆమోదం కోరుతూ.. త్వరలోనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎన్సీపీ బృందం కలవనుంది. ‘మహాయుతి’ కూటమిలో భాగస్వామిగా ఉన్నందున, బీజేపీ మద్దతు కూడగట్టేందుకు ఈ భేటీ అత్యంత కీలకం కానుంది. అజిత్ పవార్ ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచే సునేత్రను పోటీకి దింపి, గెలిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
‘పవార్’ ఫ్యామిలీ మళ్లీ ఒక్కటవుతుందా : ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ తెరపైకి వచ్చింది. అజిత్ పవార్ మరణం తర్వాత, ఎన్సీపీలోని రెండు వర్గాలు (అజిత్, శరద్ పవార్ వర్గాలు) మళ్లీ విలీనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ బతికున్నప్పుడే మున్సిపల్ ఎన్నికల సమయం నుంచే విలీన చర్చలు జరుగుతున్నట్లు భోగట్టా. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోవడంతో విలీన ప్రక్రియ వేగవంతం అయ్యేలా ఉంది.ఈ విషయాన్ని సీనియర్ నేత, మంత్రి నరహరి జిర్వాల్ వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. “రెండు వర్గాలు వేర్వేరుగా ఉండటంలో అర్థం లేదు. ఆ రెండు వర్గాలు ఇప్పటికే మానసికంగా ఒక్కటయ్యాయి” అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
తాత్కాలిక సారథిగా ప్రఫుల్ పటేల్ : విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మరణించడం పార్టీకి కోలుకోలేని దెబ్బ. టేబుల్‌టాప్ రన్‌వే అంచుకు కేవలం 200 మీటర్ల దూరంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం పార్టీని సంక్షోభంలోకి నెట్టింది. ఈ క్లిష్ట సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. సునేత్ర పవార్‌కు పదవి దక్కే వరకు పార్టీని ముందుకు నడిపించే బాధ్యత ఆయనే తీసుకోనున్నారు.

