Ahmedabad air crash Supreme Court hearing : దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 260 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటనలో పైలట్-ఇన్-కమాండ్‌ను తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ నివేదికను సవాల్ చేస్తూ మృతుని తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఈ వ్యాఖ్యలు చేస్తూనే కేంద్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)లకు నోటీసులు జారీ చేసింది. అసలు దర్యాప్తు నివేదిక ఏం తేల్చింది? దానిని సుప్రీంకోర్టు ఎందుకు ప్రశ్నిస్తోంది? ఆ వివరాల్లోకి వెళ్తే..
అసలేం జరిగింది : ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఘటనలో పైలట్-ఇన్-కమాండ్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ సహా 260 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ఈ ఏడాది జులైలో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలోని రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయిందని, రెండు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు వేగంగా ఒకదాని తర్వాత ఒకటి “కటాఫ్” పొజిషన్‌లోకి వెళ్లాయని నివేదికలో పేర్కొంది. దాదాపు 10 సెకన్ల తర్వాత స్విచ్‌లను తిరిగి ఆన్ చేసినప్పటికీ, అప్పటికే ఇంజిన్లు ఆగిపోయి (ఫ్లేమ్డ్ అవుట్) విమానం కుప్పకూలిందని, పరోక్షంగా ఇది పైలట్ తప్పిదమనే ధ్వని వచ్చేలా నివేదికను రూపొందించింది.
నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు :అయితే, ఏఏఐబీ నివేదికతో కెప్టెన్ సుమీత్ తండ్రి పుష్కరాజ్ సబర్వాల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ) విభేదించాయి. దర్యాప్తు ఏకపక్షంగా జరిగిందని, ప్రమాదానికి గల అసలు కారణాలను దాచిపెట్టి, నిందను పైలట్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం, ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేసింది.
“ఈ దశలో పైలట్‌ను నిందించలేం,” అని వ్యాఖ్యానించిన న్యాయస్థానం, ఈ ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మరియు డీజీసీఏలను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ప్రమాద దర్యాప్తు నివేదికపైనే సర్వోన్నత న్యాయస్థానం సందేహాలు వ్యక్తం చేయడంతో, ఈ కేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మృతుల కుటుంబసభ్యులు ఆశిస్తున్నారు. కేసు తదుపరి విచారణకు రానుంది


