Sunday, November 16, 2025
Homeనేషనల్Banke Bihari : 'శ్రీకృష్ణుడే తొలి రాయబారి'.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Banke Bihari : ‘శ్రీకృష్ణుడే తొలి రాయబారి’.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Supreme Court on Banke Bihari temple : బృందావన్‌లోని ప్రఖ్యాత శ్రీ బాంకే బిహారీ ఆలయ నిర్వహణ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కింది. ఆలయ నిధుల వినియోగం విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఆలయ ట్రస్ట్ మధ్య నెలకొన్న ఈ వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘శ్రీకృష్ణుడే మొదటి రాయబారి’ అంటూ చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేస్తూ, ఇరు పక్షాలకు హితవు పలికింది. అసలు ఈ వివాదం ఏంటి..? ఆలయ నిధులపై ప్రభుత్వానికి హక్కు ఉందా..? శ్రీకృష్ణుడిని ఉటంకిస్తూ సుప్రీంకోర్టు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది..? ఈ కేసులో న్యాయస్థానం వేసిన ప్రశ్నలు ఏమిటి..?

ఆర్డినెన్స్‌పై సుప్రీం అసంతృప్తి : భక్తుల సౌకర్యార్థం బృందావన్‌లో కారిడార్ అభివృద్ధి చేసేందుకు, ఆలయ నిధుల నుంచి రూ.500 కోట్లు వినియోగించాలని ప్రతిపాదిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని, ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం, యూపీ సర్కార్ తీరుపై పలు ప్రశ్నలు సంధించింది.

- Advertisement -

తొందరెందుకు : ఆలయ నిధుల వినియోగానికి సంబంధించి ఆర్డినెన్స్‌ను ఆమోదించడంలో ఇంత తొందర ఎందుకు ప్రదర్శించారని ప్రభుత్వాన్ని న్యాయస్థానం నిలదీసింది.
రహస్య పద్ధతిపై అసంతృప్తి: ఆలయ నిధుల వినియోగానికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు అనుసరించిన విధానంపై ప్రస్తుత ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. నిధుల వినియోగ ప్రక్రియ బహిరంగంగా, అందరికీ తెలిసేలా ఉండాలని అభిప్రాయపడింది.

గత ఉత్తర్వులపై పునరాలోచన: ఈ నేపథ్యంలో, ఆలయ నిధులను ప్రభుత్వం వాడుకునేందుకు గతంలో మే 15న ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు మౌఖికంగా ప్రతిపాదించింది.

మధ్యవర్తిత్వమే మార్గం.. కమిటీ ప్రతిపాదన : వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచిస్తూ, “శ్రీకృష్ణుడే మొదటి రాయబారి, ఆయన మార్గాన్ని అనుసరించి మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి” అని సుప్రీంకోర్టు ఇరు పక్షాలకు హితవు పలికింది. అంతేకాకుండా, తాత్కాలిక పరిష్కారంగా ఒక కమిటీని ప్రతిపాదించింది.

కమిటీ నిర్మాణం:  గతంలో హైకోర్టు జడ్జిగా పని చేసిన వ్యక్తిని గానీ, లేదా సీనియర్ రిటైర్డ్ జిల్లా జడ్జిని గానీ నిర్వహణ ట్రస్టీగా పెట్టి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ధర్మాసనం చెప్పింది.

కమిటీ బాధ్యతలు: యూపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధత తేలే వరకు ఈ కమిటీయే ఆలయ నిర్వహణను చూసుకుంటుందని స్పష్టం చేసింది. భక్తుల మౌలిక సదుపాయాల కోసం నిధులను వినియోగించుకునే విషయంలో ఈ కమిటీకి కొంత వెసులుబాటు కల్పిస్తామని తెలిపింది. ఈ ప్రతిపాదనపై స్పందన తెలియజేయాలని యూపీ ప్రభుత్వానికి మంగళవారం ఉదయం 10:30 గంటల వరకు గడువు ఇచ్చింది.

వివాద నేపథ్యం ఏమిటి : 1862లో నిర్మించిన ఈ ఆలయం, ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే పుణ్యక్షేత్రాల్లో ఒకటి. 2022లో జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ ఘటన తర్వాత, భక్తుల భద్రతను పరిచేందుకు, ఆలయాన్ని పునరాభివృద్ధి చేయాలనే డిమాండ్లు పడ్డాయి. దీనిపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు, భక్తుల రద్దీని నియంత్రించి, భద్రత కల్పించేందుకు ఒక కారిడార్ ప్రణాళికను రూపొందించాలని 2023 సెప్టెంబర్‌లో యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకే ప్రభుత్వం ఆలయ నిధులతో కారిడార్ నిర్మాణానికి ఆర్డినెన్స్ తీసుకురావడం వివాదానికి దారితీసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad