Bilkis Bano: తనపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల ముందస్తు విడుదలను సవాలు చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోపై నిందితులు అత్యాచారానికి పాల్పడటంతోపాటు, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేశారు. ఈ ఘటనలో బిల్కిస్ బానో తన కుటుంబ సభ్యులను కోల్పోయింది.
2002లో జరిగింది ఈ ఘటన. దీనిపై విచారణ జరిపిన కోర్టు 11 మందిని దోషులుగా తేల్చింది. 2008లో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే, ఇటీవల ఆగష్టు 15న 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. క్షమాభిక్ష, సత్ప్రవర్తన కింద నిందితుల్ని విడుదల చేసింది. దీంతో వాళ్లు ప్రస్తుతం బయట స్వేచ్చగా తిరుగుతున్నారు. నిందితుల విడుదలను సవాలు చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శనివారం కొట్టివేసింది. అత్యాచార ఘటన జరిగిన సమయంలో బిల్కిస్ బానోకు 21 సంవత్సరాలు. అప్పుడు ఆమె ఐదు నెలల గర్భిణి.
ఈ ఘటన సమయంలో నిందితులు ఆమె కుటుంబ సభ్యులతోపాటు మూడేళ్ల కూతురును కూడా చంపేశారు. ఈ కేసు నిందితుల్లో ఒకడు తనను 1992 జూలై నాటి చట్టం ప్రకారం ముందస్తుగా విడుదల చేసేలా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనికి స్పందించిన న్యాయస్థానం నిందితుడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం నిందితులు 14 ఏళ్లు జైల్లో సత్ప్రవర్త కలిగి ఉన్నారని, దీంతో విడుదల చేస్తున్నామని ప్రకటించింది.