Supreme court gives sensational verdict on parents: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంక్షేమానికి సంబంధించి సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని మరోసారి స్పష్టం చేసింది. వారి బాగోగులు పట్టించుకోని పిల్లలను బయటకు వెళ్లగొట్టొచ్చని తేల్చిచెప్పింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం’ అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది. కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించగా గురువారం తాజా తీర్పు వెల్లడించింది. 2023లో ఈ వృద్ధ జంట కుమారుడి నుంచి పోషణ ఖర్చులు, అలాగే తమ ఆస్తులు తమకు చెందేలా చూడాలని కోరుతూ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. వారి అభ్యర్థనను పరిశీలించిన ట్రైబ్యునల్.. నెలకు రూ.3000 ఇవ్వాలని, అలాగే ముంబయిలోని వారి ఇంటిని ఖాళీ చేయాలని తీర్పునిచ్చింది. అయితే, ముంబయి హైకోర్టు ఆ తీర్పును తోసిపుచ్చింది. 2007 చట్టం ప్రకారం ఆ కుమారుడు కూడా సీనియర్ సిటిజన్ కావడంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టేలా ఆదేశాలు ఇచ్చే న్యాయపరిధి ట్రైబ్యునల్‌కు లేదని స్పష్టం చేసింది, అయితే, ఈ విషయంలో ట్రైబ్యునల్ తీర్పును సమర్థిస్తూ, హైకోర్టు పరిగణనలోకి తీసుకున్న కారణం తప్పని సుప్రీం అభిప్రాయం వ్యక్తంచేసింది. నవంబర్ 30లోగా ఆ కుమారుడు ఇంటిని ఖాళీ చేయాలని గడువు ఇచ్చింది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/reliance-investment-in-ap-kurnool/
బాధ్యతను విస్మరిస్తే ఆస్తి హక్కు రద్దు..
వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఓ కేసులోనూ సుప్రీంకోర్టు గతంలో ఇటువంటి తీర్పు వెలువరించింది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి కుమారులు, కుమార్తెలదేనని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కులేదని తేల్చి చెప్పింది. వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులన్నీ చూసుకుంటానని హామీనిచ్చి, వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పడంతో మధ్యప్రదేశ్‌కు చెందిన తల్లిదండ్రులు సుప్రీంను ఆశ్రయించారు. ఆ కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దుచేసి సదరు ఆస్తిని తిరిగి వృద్ధులకే కట్టబెట్టింది. తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునళ్లు… కన్నవారిని పట్టించుకోని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని తెలిపింది. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రైబ్యునళ్లకు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.


