Menstrual Hygiene Management in Indian Schools: భారతదేశంలో అక్షరాస్యత సాధనలో మహిళా విద్య అత్యంత కీలకం. అయితే, కేవలం శానిటరీ ప్యాడ్స్, ప్రత్యేక మరుగుదొడ్లు లేవనే ఒకే ఒక్క కారణంతో దేశంలో ఏ ఒక్క ఆడపిల్లా చదువును మధ్యలోనే వదిలేయకూడదని సుప్రీంకోర్టు సోమవారం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిబంధనలను అక్షరాలా, పూర్తి నిబద్ధతతో అమలు చేసేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా స్పష్టం చేసింది.
గతంలో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అమలు తీరుపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, మౌలిక వసతుల లేమితో బాలికల చదువు ‘అటకెక్కడం’ రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది.
Also Read: https://teluguprabha.net/national-news/twisha-sharma-case-supreme-court-cbi-investigation-media-trial/
నెలసరి సౌకర్యం.. రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు తన తీర్పులో అత్యంత కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. నెలసరి పరిశుభ్రత (Menstrual Hygiene) అనేది కేవలం ఒక ఆరోగ్య సమస్య లేదా సంక్షేమ పథకం కాదు; అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు, గౌరవం) మరియు ఆర్టికల్ 21A (ఉచిత, నిర్బంధ విద్యా హక్కు – RTE) లలో అంతర్భాగమని కోర్టు స్పష్టం చేసింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, మరియు ప్రైవేట్ పాఠశాలల్లో (6 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు) ఈ వసతులు కల్పించడం ఇకపై విధిగా మారనుంది.
ఉచిత పంపిణీ: పర్యావరణానికి హాని చేయని ఆక్సో-బయోడిగ్రేడబుల్ (Oxo-biodegradable) శానిటరీ న్యాప్కిన్లను పాఠశాలల్లో బాలికలకు పూర్తిగా ఉచితంగా అందించాలి.
బడుల్లో రాబోతున్న విప్లవాత్మక మార్పులు: 4 కీలక దశలు
న్యాయస్థానం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం, ప్రతి పాఠశాల ఈ క్రింది మౌలిక వసతులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది:
ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం తక్షణ ప్రాధాన్యత
బాలబాలికలకు విడివిడిగా, నిరంతర నీటి సరఫరా మరియు సబ్బులతో కూడిన సురక్షితమైన, వ్యక్తిగత గోప్యత (Privacy) ఉండే మరుగుదొడ్లను నిర్మించాలి. దీన్ని దివ్యాంగ విద్యార్థులకు కూడా అనుకూలంగా మార్చాలి.
Also Read: https://teluguprabha.net/telangana/zaid-khan-arrested-medchal-isi-terror-link-hyderabad/
శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మెషీన్లు అందుబాటు వసతి : మరుగుదొడ్ల ప్రాంగణంలోనే లేదా స్పష్టంగా గుర్తించదగిన ప్రదేశాలలో శానిటరీ ప్యాడ్స్ అందించే వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేయాలి.
MHM కార్నర్ల ఏర్పాటు – అత్యవసర రక్షణ
ప్రతి స్కూల్‌లో ‘మెన్‌స్ట్రువల్ హైజీన్ మేనేజ్‌మెంట్’ (MHM) కార్నర్లను నెలకొల్పాలి. అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా అదనపు యూనిఫారాలు, ఇన్నర్‌వేర్‌లను అక్కడ సిద్ధంగా ఉంచాలి.
సురక్షిత వ్యర్థాల నిర్మూలన – పర్యావరణ రక్షణ
ఉపయోగించిన ప్యాడ్స్ పారేయడానికి వీలుగా మూతలున్న చెత్తబుట్టలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం పర్యావరణ హితమైన డిస్పోజల్ సిస్టమ్స్ (Incinerators) ఏర్పాటు చేయాలి.
అవగాహన రాహిత్యం.. మగవారిలోనూ మార్పు రావాలి : కోర్టు కేవలం వసతుల గురించే కాకుండా సామాజిక మార్పు పైనా దృష్టి సారించింది. సమాజంలో నెలసరిపై ఉన్న అపోహలను, మూఢనమ్మకాలను తొలగించడానికి విద్యాసంస్థల్లో మూడు అంచెల అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించింది. ప్రత్యేకించి, “మెన్ ఇన్ మెన్‌స్ట్రుయేషన్” (Men in Menstruation) భావనను ముందుకు తెస్తూ, పాఠశాలల్లోని పురుష ఉపాధ్యాయులకు, బాలురకు కూడా ఈ జీవసంబంధిత ప్రక్రియపై అవగాహన కల్పించాలని, తద్వారా బాలికలు ఎలాంటి హేళనకు, ఇబ్బందికి గురికాకుండా చూడాలని కోర్టు నొక్కి చెప్పింది.

