Supreme Court On Governors’ Assent To Bills: గవర్నర్ల విచక్షణాధికారాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు తమ వద్ద నిలిపి ఉంచడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బిల్లులకు ఆమోదం తెలపకుండా “అనంతమైన కాలం” పాటు గవర్నర్లు జాప్యం చేయడం సరైనది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200లో “వీలైనంత త్వరగా” (as soon as possible) అనే పదానికి ఎలాంటి విలువ లేకుండా పోతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
గతంలో ఆర్టికల్ 200లో బిల్లులను పరిశీలించడానికి ఆరు వారాల గడువు ఉండేదని, ఆ తర్వాత రాజ్యాంగ నిర్మాతలు దీనిని “వీలైనంత త్వరగా” అని మార్చారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఈ పదాన్ని గవర్నర్లు ఎలా విస్మరించగలరని కేంద్రాన్ని ప్రశ్నించింది.
“సూపర్ ముఖ్యమంత్రి”లుగా గవర్నర్లు..
రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల చర్యలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చా లేదా అనే అంశంపై కూడా ఈ ధర్మాసనం విచారణ చేపట్టింది. తమిళనాడు తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, గవర్నర్లకు అపరిమిత అధికారాలు ఉంటే వారు “సూపర్ ముఖ్యమంత్రి”లుగా వ్యవహరిస్తారని అన్నారు. బిల్లును నిలిపివేయడం అంటే శాసనసభకు తిరిగి పంపడమే తప్ప, శాశ్వతంగా తమ వద్దే ఉంచుకోవడం కాదని ఆయన తెలిపారు. రాజ్యాంగ రూపకర్తలు గవర్నర్లను కేవలం నామమాత్రపు అధిపతులుగా మాత్రమే భావించారని, వారికి నిర్ణయాధికారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.


