Homeనేషనల్Court : నిష్కళంక చరిత్రకు న్యాయం.. బొగ్గు కేసులో దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్లీన్...

Court : నిష్కళంక చరిత్రకు న్యాయం.. బొగ్గు కేసులో దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్!

Manmohan Singh Coal Block Case : దేశ రాజకీయాల్లో తన నిజాయితీ, నిష్కళంకమైన వ్యక్తిత్వానికి మారుపేరుగా నిలిచిన దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టులో అత్యున్నత నైతిక విజయం లభించింది. దశాబ్ద కాలానికి పైగా ఆయనపై మాయని మచ్చగా మిగిలిన ‘తలబీరా-2’ బొగ్గు బ్లాక్ కేటాయింపు కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం నాడు శాశ్వతంగా మూసివేసింది. 

ఘనమైన చరిత్రకు దక్కిన న్యాయం: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26, 2024న తన 92వ యేట కన్నుమూశారు. సాధారణంగా పిటిషనర్ మరణిస్తే కేసు ముగిసినట్లే భావిస్తారు. అయితే, ఆయన ఘనమైన ప్రతిష్టకు, చరిత్రకు ఈ కేసు వల్ల ఏ విధమైన మచ్చ పడకూడదన్న ఉద్దేశ్యంతో సుప్రీంకోర్టు ఈ అప్పీల్‌ను మెరిట్స్ ఆధారంగా విచారించాలని నిర్ణయించింది.

- Advertisement -

బుధవారం నాడు దేశ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. మన్మోహన్ సింగ్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ కపిల్ సిబల్… “ఈ కేసులో ట్రయల్ కోర్టు మన్మోహన్ సింగ్‌పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను, రికార్డులను తొలగించాల్సిన అవసరం ఉంది. ఆయన చరిత్రకు మచ్చ పడకూడదు” అని కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు ఏకీభవిస్తూ, ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను పూర్తిగా రద్దు చేసింది.

ట్రయల్ కోర్టు వైఖరిని తప్పుపట్టిన అత్యున్నత ధర్మాసనం : తమ సుదీర్ఘ తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేక సీబీఐ ట్రయల్ కోర్టు తీరును తీవ్రంగా తప్పుపట్టింది. దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఈ కేసులో మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్ ఇస్తూ క్లోజర్ రిపోర్ట్ సమర్పించినప్పటికీ, ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దానిని తిరస్కరించి 2015లో మన్మోహన్‌కు సమన్లు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుగా అభివర్ణించింది.

“సీబీఐ సమర్పించిన రెండు క్లోజర్ రిపోర్టులను మేము నిశితంగా పరిశీలించాము. దేశ సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన నిబంధనల ప్రకారం… దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన నివేదికలను తిరస్కరించి, నిందితులకు సమన్లు జారీ చేయాల్సిన అవసరం స్పెషల్ కోర్టు న్యాయమూర్తికి ఎంతమాత్రం లేదు. ఈ కేసులో తదుపరి విచారణకు ఎలాంటి గట్టి ఆధారాలు లేవని స్పష్టమవుతోంది. అందుకే ప్రత్యేక కోర్టు 2015లో జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తూ, కేసును శాశ్వతంగా మూసివేస్తున్నాం.”
— సుప్రీంకోర్టు ధర్మాసనం

అసలేమిటీ తలబీరా-2 బొగ్గు కేటాయింపు కేసు : ఈ కేసు మూలాలు 2005వ సంవత్సరానికి చెందుతాయి. ఒడిశాలోని ‘తలబీరా-2’ బొగ్గు బ్లాక్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్‌కు కేటాయించే సమయంలో అక్రమాలు జరిగాయని సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగే స్వయంగా బొగ్గు శాఖ బాధ్యతలను కూడా పర్యవేక్షించేవారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News