Kangana Ranaut Tweet Supreme Court: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన క్రిమినల్ డిఫమేషన్ కంప్లయింట్(పరువు నష్టం కేసు)ను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కంగనా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కంగనా తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దాంతో ఆమె సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిందర్ కౌర్ అనే వృద్ధ మహిళపై కంగనా ‘X’ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె రూ.100 కిరాయికి వస్తుందని తన రీట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించిన బిల్కిస్ బానో, రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మహిందర్ కౌర్ ఇద్దరూ ఒకటేనంటూ కంగనా రీట్వీట్ చేశారు.
హైకోర్టులోనూ చుక్కెదురు
ఈ క్రమంలో కంగనాపై మహిందర్ కౌర్ పరువు నష్టం కేసు వేశారు. దీంతో కౌర్ ఫిర్యాదును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కంగనా ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ధర్మాసనం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మసాలా జోడించారు
‘మీ వ్యాఖ్యలకు అర్థం ఏమిటి..? మీది సింపుల్ రీట్వీట్ కాదు. మీరు మీ సొంత కామెంట్స్ చేశారు. దీనికి మసాలా జోడించారు.’ అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. తన క్లయింట్ ఆ రీట్వీట్‌పై స్పష్టత ఇచ్చారని కంగనా తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ క్లారిఫికేషన్ ట్రయల్ కోర్టుకు ఇవ్వండని ధర్మాసనం చీవాట్లు పెట్టింది. కంగనా పంజాబ్‌కు వెళ్లే పరిస్థితి లేదని న్యాయవాది చెప్పగా.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరవచ్చని కోర్టు స్పష్టం చేసింది. న్యాయవాది మరేదో వాదన చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె ట్వీట్‌పై ధర్మాసనం స్పందన కోరే ప్రయత్నం చేయకండని ఘాటుగా వ్యాఖ్యానించింది.


