Amritpal Singh NSA detention : ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ అధినేత, ఖడూర్ సాహిబ్ ఎంపీ అమృత్‌పాల్ సింగ్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించలేదు. జాతీయ భద్రతా చట్టం (NSA) కింద తనను నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే, న్యాయపోరాటానికి మరో మార్గాన్ని సూచించింది. అసలు న్యాయస్థానంలో ఏం జరిగింది? రెండేళ్లుగా జైల్లో ఉన్న అమృత్‌పాల్ కేసు నేపథ్యం ఏమిటి? ఆ వివరాల్లోకి వెళ్తే..
ముందు హైకోర్టుకు వెళ్లండి: సుప్రీం ధర్మాసనం : జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం అమృత్‌పాల్ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ను నేరుగా విచారించలేమని స్పష్టం చేస్తూ, ముందుగా పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించాలని అమృత్‌పాల్‌కు సూచించింది. అమృత్‌పాల్ పిటిషన్‌పై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. విచారణ సందర్భంగా, అమృత్‌పాల్ తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గోన్సాల్వెస్ వాదనలు వినిపిస్తూ.. “కేవలం ఒకే ఒక్క ఎఫ్‌ఐఆర్ ఆధారంగా నా క్లయింట్‌ను రెండేళ్లుగా నిర్బంధంలో ఉంచారు. ఆ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ కూడా దాఖలైంది,” అని కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్రం తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు, హైకోర్టుకు ఎనిమిది వారాల గడువు ఇవ్వాలని కోరగా, ధర్మాసనం ఆరు వారాలకే పరిమితం చేసింది.
పోలీస్ స్టేషన్‌పై దాడి నుంచి పార్లమెంటు వరకు : ఖలిస్థానీ సానుభూతిపరుడు, వేర్పాటువాద నేత భింద్రన్‌వాలేను అనుకరించే అమృత్‌పాల్ సింగ్, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ ద్వారా పంజాబ్‌లో వేర్పాటువాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై దృష్టి సారించారు. ఫిబ్రవరి 23, 2023న తన అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్ తూఫాన్ విడుదల కోసం, కత్తులు, తుపాకులతో వందలాది మంది అనుచరులతో కలిసి అమృత్‌సర్‌లోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత పంజాబ్ పోలీసులు భారీ ఆపరేషన్ ప్రారంభించగా, అమృత్‌పాల్ నెల రోజుల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. చివరకు, ఏప్రిల్ 23, 2023న మోగా జిల్లాలో అతడిని అరెస్టు చేసి, జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన తన 9 మంది అనుచరులతో కలిసి అక్కడే జైలు జీవితం గడుపుతున్నారు.
వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, హత్యాయత్నం, పోలీసులపై దాడి వంటి పలు తీవ్రమైన క్రిమినల్ కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు. అయితే, జైల్లో ఉంటూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థిపై దాదాపు 1.97 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి ఎంపీగా ఎన్నిక కావడం గమనార్హం.


