Tuesday, February 17, 2026
Homeనేషనల్Supreme Court : ఈసీకి 'పౌరసత్వ' పగ్గాలెవరిచ్చారు? అది రాజ్యాంగం ఇచ్చిన 'బ్లాంక్ చెక్' కాదు!

Supreme Court : ఈసీకి ‘పౌరసత్వ’ పగ్గాలెవరిచ్చారు? అది రాజ్యాంగం ఇచ్చిన ‘బ్లాంక్ చెక్’ కాదు!

ECI Citizenship Power : ఎన్నికల నిర్వహణ అంటే ఓటర్ల జాబితాను సవరించడం వరకేనా? లేక ఎవరు పౌరులు, ఎవరు కాదు అని నిర్ణయించే అధికారం కూడా ఎన్నికల సంఘం (ECI) పరిధిలో ఉందా? రాజ్యాంగం ఎన్నికల సంఘానికి కల్పించిన అధికారాలు ‘నిరంకుశమైనవా’? ఈ కీలక ప్రశ్నలపై గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఆసక్తికర వాదనలు జరిగాయి. బీహార్ రాష్ట్రంలో చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను ముగించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. పార్లమెంటు చట్టాలను కాదని, ఎన్నికల సంఘం ఏకపక్షంగా పౌరసత్వాన్ని నిర్ధారించే బాధ్యతను భుజాన వేసుకోవడంపై పిటిషనర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

- Advertisement -

బీహార్ ‘ఓటర్ల సవరణ’పై రగడ : బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియ ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఇది కేవలం ఓటర్ల జాబితా సవరణ కాదని, పరోక్షంగా పౌరసత్వాన్ని వడపోసే ప్రక్రియలా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిని సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై తుది విచారణ చేపట్టింది.

ఈసీకి ‘బ్లాంక్ చెక్’ ఇవ్వలేదు: ప్రశాంత్ భూషణ్ : పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, నేహా రాఠీలు ధర్మాసనం ముందు బలమైన వాదనలు వినిపించారు.
అపరిమిత అధికారం కాదు: ఎన్నికలను నిర్వహించే అధికారం ఈసీకి ఉన్నంత మాత్రాన.. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం  వారికి సంక్రమించదని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. పార్లమెంటు రూపొందించిన చట్టాలు, నిబంధనలను అతిక్రమించి ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎలాంటి సరైన కారణం చూపకుండానే , తన సొంత మాన్యువల్‌లోని పరిమితులను కూడా ఈసీ తుంగలో తొక్కిందని, పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారాన్ని ఏకపక్షంగా తన చేతుల్లోకి తీసుకుందని వాదించారు.

రాజ్యాంగ పరిధిని దాటొద్దు : ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినప్పటికీ, అది చట్టానికి అతీతం కాదని పిటిషనర్లు వాదించారు. పౌరసత్వం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ ఆ అధికారాలను హైజాక్ చేయలేదని పేర్కొన్నారు. బీహార్‌లో జరుగుతున్న ఈ ప్రక్రియ వల్ల అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలను సావధానంగా ఆలకించిన సీజేఐ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల సంఘం అధికారాల పరిధిని, పౌరసత్వ చట్టాల అన్వయాన్ని ఈ తీర్పు స్పష్టం చేయనుండటంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News