Supreme Court Hearing on stray dogs: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వీధి కుక్కల సమస్యపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసింది. ఈ మేరకు తన తీర్పును రిజర్వ్ చేసింది. వారం రోజుల్లోగా లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఆదేశించింది.
వీధి కుక్కల నియంత్రణకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా లేవని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వీధి కుక్కల సమస్యలపై దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ పూర్తి చేసింది. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆదేశాలు చేసింది.
Also Read: https://teluguprabha.net/national-news/tamilnadu-congress-counter-on-vijay-tvk-offer/
కుక్కల సంతానోత్పత్తి నియంత్రణ(ABC) కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్రాలు వాస్తవానికి భిన్నమైన గణాంకాలు ఇస్తున్నాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఇది కేవలం “కాగితాల మీద కోటలు కట్టడం” లాంటిదని వ్యాఖ్యానించింది. కుక్క కాటుకు గురైన వారికి లేదా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కోర్టు గత విచారణలో హెచ్చరించిన విషయం తెలిసిందే. అదేవిధంగా వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా ఆ కుక్కల దాడికి జవాబుదారీ కావాలని స్పష్టం చేసింది.
పాఠశాలలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్ల వంటి రద్దీగా ఉండే ప్రాంతాల నుంచి వీధి కుక్కలను వెంటనే తొలగించి, షెల్టర్ హోమ్‌లకు తరలించాలని గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై కూడా ధర్మాసనం వివరాలు అడిగింది. హైవేలపై తిరుగుతున్న వీధి కుక్కలు, పశువులను తొలగించే బాధ్యత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేనని స్పష్టం చేసిన ధర్మాసనం.. రోడ్లపై జంతువులను గుర్తించడానికి ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించాలని సూచనలు చేసింది.
ఈ మేరకు తీర్పు రిజర్వ్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. పిటిషనర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జంతు సంరక్షణ సంస్థలు, కుక్క కాటు బాధితులు తమ తుది లిఖితపూర్వక వాదనలను వారం రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. కాగా, రాష్ట్రాల్లో కుక్క కాటు కేసులు భారీగా పెరుగుతుండగా.. సుప్రీంకోర్టు వెలువరించబోయే ఈ తుది తీర్పు దేశవ్యాప్తంగా పౌరుల భద్రత, జంతువుల హక్కుల మధ్య సమతుల్యతను ఎలా సాధిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

