Supreme Court judgement on toll tax : మీరు ప్రయాణించే దారి గుంతలమయంగా ఉందా..? గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటూ విలువైన సమయాన్ని, ఇంధనాన్ని వృధా చేస్తున్నారా? అయినా సరే, టోల్ ప్లాజా వద్ద పూర్తి రుసుము చెల్లించాల్సి వస్తోందని మధనపడుతున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే! దేశంలోని కోట్లాది వాహనదారుల పాలిట వరంలాంటి ఓ సంచలన తీర్పును భారత సర్వోన్నత న్యాయస్థానం వెలువరించింది. అధ్వాన్నంగా ఉన్న రహదారులపై టోల్ వసూలు చేయడం చెల్లదని తేల్చిచెప్పింది. ఇంతకీ సుప్రీంకోర్టు ఈ చారిత్రక తీర్పును ఏ కేసులో ఇచ్చింది..? దీని వెనుక ఉన్న బలమైన వాదనలేమిటి..?
పౌరుల సంక్షేమమే ప్రథమం: ప్రయాణానికి అనుకూలంగా లేని, గుంతలమయమైన రహదారులపై, ముఖ్యంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలున్న చోట టోల్ వసూలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని పలియక్కర టోల్ ప్లాజా వద్ద నాలుగు వారాల పాటు టోల్ వసూలును నిలిపివేయాలని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), టోల్ వసూలు సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే, ఈ అప్పీల్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం ఈ కీలకమైన తీర్పును వెలువరించింది. “టోల్ వసూలు నిలిపివేత వల్ల కలిగే ఆర్థిక నష్టం కంటే పౌరుల సంక్షేమమే మాకు ముఖ్యం” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్య ద్వారా, అద్వానంగా ఉన్న రోడ్లపై టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని ధర్మాసనం గట్టిగా అభిప్రాయపడింది.
కేరళ ఘటన.. దేశవ్యాప్త తీర్పుకు నాంది : ఈ కేసుకు మూలం కేరళలోని ఎడప్పల్లి – మన్నుత్తి జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన ఓ సంఘటన. రహదారి నిర్వహణ లోపం, నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. గంటలో చేరాల్సిన గమ్యస్థానానికి ఏకంగా 12 గంటలు పట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటనపై స్థానిక మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిని సుమోటోగా స్వీకరించిన కేరళ హైకోర్టు, ప్రజల నుంచి టోల్ వసూలు చేయలేరని, టోల్ వసూళ్లను నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ NHAI సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా వారికి అనుకూలంగా తీర్పు రాలేదు.
హక్కులు కల్పించనప్పుడు.. రుసుము ఎందుకు : టోల్ రుసుము చెల్లించే ప్రతి పౌరుడికి, సౌకర్యవంతమైన, అడ్డంకులు లేని రహదారిపై ప్రయాణించే హక్కు ఉంటుందన్న కేరళ హైకోర్టు వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. “ప్రజలు టోల్ చెల్లించాలనే బాధ్యత, వారికి అడ్డంకులు లేని ప్రయాణాన్ని కల్పిస్తామనే హామీపై ఆధారపడి ఉంటుంది. NHAI లేదా దాని ఏజెంట్లు ఆ సౌకర్యాన్ని కల్పించడంలో విఫలమైతే, అది ప్రజల అంచనాలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇది టోల్ వ్యవస్థ పునాదులనే దెబ్బతీస్తుంది,” అని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే పన్నులు కట్టి నిర్మించిన రోడ్లపై ప్రయాణించే స్వేచ్ఛ పౌరులకు ఉందని, గుంతలు, కాలువల్లో ప్రయాణించడానికి అదనంగా టోల్ కట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
“12 గంటల ప్రయాణానికి టోల్ ఎందుకు” : NHAI తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, టోల్ నిలిపివేత వల్ల రోజుకు రూ.49 లక్షల నష్టం వాటిల్లుతుందని, రహదారుల నిర్వహణకు ఈ ఆదాయం కీలకమని తెలిపారు. అయితే ధర్మాసనం ఈ వాదనను తిరస్కరించింది. “ఒక చివర నుంచి మరో చివరకు చేరడానికి 12 గంటలు పడుతుంటే, ఓ వ్యక్తి రూ.150 టోల్ ఎందుకు చెల్లించాలి? గంటలో జరగాల్సిన ప్రయాణానికి అదనంగా 11 గంటలు పడుతుంటే టోల్ వసూలు చేయడం ఎంతవరకు సమంజసం?” అని సీజేఐ జస్టిస్ గవాయ్ తీవ్రంగా ప్రశ్నించారు. ప్రయాణానికి యోగ్యంగా లేని రోడ్డుపై టోల్ అడిగే హక్కు ఎక్కడిదని నిలదీశారు.


