Supreme Court POSH Act Does Not Apply to Political Parties: రాజకీయ పార్టీలకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం వర్తిస్తుందా? ఈ కీలకమైన ప్రశ్నపై సుప్రీంకోర్టు సోమవారం నాడు తన వైఖరిని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలను ‘పని ప్రదేశాలు’గా పరిగణించలేమని, కాబట్టి వాటికి పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం (పోష్ చట్టం, 2013) వర్తింపజేయలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు దాఖలైన ఒక పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది.
ALSO READ: SC On Waqf Act : వక్ఫ్ చట్టంపై సుప్రీం ‘స్టే’.. కాంగ్రెస్ హర్షం! “రాజ్యాంగ విలువల విజయం”
రాజకీయ రంగంలో పనిచేస్తున్న మహిళలకు కూడా ఈ చట్టం కింద రక్షణ కల్పించాలని కోరుతూ న్యాయవాది యోగమాయ ఎంజీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‌పీ) దాఖలు చేశారు. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీ.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. “ఒక రాజకీయ పార్టీకి, దాని కార్యకర్తకు మధ్య యజమాని-ఉద్యోగి సంబంధం ఎలా ఉంటుంది? అలాంటప్పుడు పార్టీ కార్యాలయాన్ని ‘పని ప్రదేశం’ అని ఎలా నిర్వచిస్తాం?” అని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది.
ALSO READ: India-China : డ్రాగన్‌కు చెక్.. బ్రహ్మపుత్రపై భారత్ మెగా డ్యామ్! చైనా ‘వాటర్ బాంబు’కు దీటైన జవాబు!
రాజకీయ పార్టీలలో యజమాని-ఉద్యోగి సంబంధం లేనందున, అక్కడ అంతర్గత ఫిర్యాదుల కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని 2022 మార్చిలో కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘పోష్’ చట్టాన్ని కేవలం సంప్రదాయ ఉద్యోగాలకే పరిమితం చేయడం సరికాదని, దీనివల్ల రాజకీయాలు, సినిమా, మీడియా వంటి అనధికారిక రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది మహిళలు రక్షణ కోల్పోతున్నారని పిటిషనర్ వాదించారు.
‘విశాఖ మార్గదర్శకాల’ స్ఫూర్తితో వచ్చిన ఈ చట్టం పరిధి చాలా విస్తృతమైనదని, సంస్థాగత నియంత్రణ ఉన్న ప్రతి చోటా ఇది వర్తించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, సుప్రీంకోర్టు ఈ వాదనలతో ఏకీభవించలేదు. కేరళ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ తీర్పుతో రాజకీయ పార్టీలలో లైంగిక వేధింపుల ఫిర్యాదుల కోసం ఒక నిర్దిష్ట చట్టపరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు ప్రస్తుతానికి తెరపడినట్లయింది.
ALSO READ: Waqf Amendment Act: వక్ఫ్ చట్టం- 2025లో కీలక ప్రొవిజన్ నిలిపివేత


