Sunday, November 16, 2025
Homeనేషనల్Supreme Court : రాజకీయ పోరాటాలా... ఈడీపై సుప్రీంకోర్టు నిప్పులు!

Supreme Court : రాజకీయ పోరాటాలా… ఈడీపై సుప్రీంకోర్టు నిప్పులు!

Supreme Court warns ED against political misuse : “రాజకీయ యుద్ధాలు చేయాలనుకుంటే ఎన్నికల క్షేత్రంలో చేసుకోండి, అంతేకానీ దర్యాప్తు సంస్థలను వాడుకుంటామంటే కుదరదు!” అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. చట్టపరమైన చర్యల ముసుగులో రాజకీయ పోరాటాలకు దిగడం అధికార దుర్వినియోగమే అవుతుందని తీవ్రంగా మండిపడింది. అసలు సుప్రీంకోర్టుకు అంతటి ఆగ్రహం ఎందుకు వచ్చింది.? కేవలం ఒకే కేసులో ఈడీ ఎందుకు ఇంతలా మాటలు పడాల్సి వచ్చింది..? ఈ రాజకీయ పోరాటాల వెనుక ఉన్న అసలు కథేంటి..?

- Advertisement -

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి, రాష్ట్ర మంత్రికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈడీ వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామం దర్యాప్తు సంస్థల పనితీరుపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

‘ముడా’ కుంభకోణం కేసు: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య బి.ఎం. పార్వతి, రాష్ట్ర మంత్రి సురేశ్‌లకు ఈడీ గతంలో సమన్లు జారీ చేసింది. అయితే, ఈ సమన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం, ఈడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు: ధర్మాసనం ఈడీని సూటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
“రాజకీయ యుద్ధాలు కోర్టు బయటే చేసుకోవాలి. అలాంటి పోరాటాలకు ఈడీని ఎందుకు వాడుతున్నారు?” “ఈ కేసులో దిగువ కోర్టు, హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిసీ సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు?” “ఎన్నికల్లో రాజకీయ యుద్ధాలు చేసుకోనివ్వండి. మీరెందుకు మధ్యలో దూరిపోతున్నారు?” అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. “దురదృష్టవశాత్తూ మహారాష్ట్రలో నాకు ఇలాంటి అనుభవం ఉంది. దయచేసి మమ్మల్ని మాట్లాడేలా ఒత్తిడి చేయవద్దు. ఒకవేళ అలా చేస్తే, మేము ఈడీ గురించి చాలా కఠినమైన విషయాలు చెప్పాల్సి ఉంటుంది” అని సీజేఐ గట్టిగా హెచ్చరించారు.

సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని గమనించిన ఈడీ తరఫు న్యాయవాది, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు, తాము పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని తెలిపారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

కుంభకోణం నేపథ్యం: మైసూరు సమీపంలోని కెసరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతికి ఉన్న మూడు ఎకరాల భూమిని ‘ముడా’ అభివృద్ధి పనుల కోసం స్వాధీనం చేసుకుంది. దానికి పరిహారంగా 2021లో అత్యంత విలువైన విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. దీని విలువ రూ.3,000-రూ.4,000 కోట్ల కుంభకోణమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ రంగంలోకి దిగింది.

మరో కేసులోనూ ఈడీకి చుక్కెదురు: ఇదే రోజు మరో కేసులోనూ ఈడీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసు దర్యాప్తు సమయంలో నిందితులకు న్యాయసలహాలు ఇచ్చే న్యాయవాదులకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించింది. “ఒకవేళ న్యాయవాది తప్పుడు సలహా ఇచ్చినా, అతనికి సమన్లు ఎలా జారీ చేస్తారు..? ఈ విషయంపై కచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉంది” అని సీజేఐ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఒక అమికస్ క్యూరీని (న్యాయస్థాన సహాయకుడు) నియమిస్తామని, వచ్చే వారం విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈడీ చర్యలు న్యాయవాద వృత్తిపైనే దాడి అని సీనియర్ న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad