Mumbai Train Blasts Case Supreme Court: దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 2006 ముంబయి సబర్బన్ రైలు వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇటీవల బాంబే హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 189 మంది అమాయకులను బలిగొన్న ఈ మారణహోమంలో, న్యాయపోరాటం మరో కీలక మలుపు తిరిగింది. అసలు హైకోర్టు వారిని ఎందుకు నిర్దోషులుగా ప్రకటించింది? ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించడం వెనుక కారణాలేంటి? విడుదలైన నిందితుల భవితవ్యం ఏమిటి?
దాదాపు రెండు దశాబ్దాల క్రితం, 2006 జులై 11న, ముంబయి పశ్చిమ రైల్వే లైన్‌లోని పలు రైళ్లలో ప్రెషర్ కుక్కర్ బాంబులు గంటల వ్యవధిలో పేలి నగరాన్ని రక్తసిక్తం చేశాయి. ఈ ఘోర దుర్ఘటనలో 189 మంది ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
కేసు ప్రస్థానం – అంచెలంచెలుగా…
ప్రత్యేక కోర్టు తీర్పు (2015): సుదీర్ఘ దర్యాప్తు, విచారణ అనంతరం, 2015 అక్టోబరులో ప్రత్యేక ‘మకోకా’ కోర్టు ఈ కేసులో 12 మందిని దోషులుగా నిర్ధారించింది. రైళ్లలో బాంబులు పెట్టినందుకు గాను ఐదుగురికి మరణశిక్ష, మిగిలిన ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
బాంబే హైకోర్టు సంచలనం: ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ దోషులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ కాలం పాటు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం, ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. నిందితులపై మోపబడిన అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించింది. ఘటనలో ఎలాంటి పేలుడు పదార్థాలు వాడారో కూడా కచ్చితంగా నిరూపించలేకపోయిందని పేర్కొంటూ, 12 మందినీ నిర్దోషులుగా ప్రకటించి, వారి విడుదలకు ఆదేశించింది. (దోషుల్లో ఒకరైన కమాల్ అన్సారీ 2021లో కొవిడ్‌తో జైల్లోనే మరణించాడు).
సుప్రీంకోర్టులో సవాల్: హైకోర్టు తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ: https://teluguprabha.net/national-news/up-teacher-head-massage-viral-video/
సుప్రీం ఆదేశాలు – తాజా పరిస్థితి : బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే, ఇప్పటికే జైలు నుంచి విడుదలైన నిందితులను తిరిగి అరెస్టు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ విడుదలైన నిందితులకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కేసు విచారణ మరోసారి మొదటికి వచ్చినట్లయింది.


