Supreme Court On UGC : దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రకంపనలు సృష్టించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతన నిబంధనల వ్యవహారంలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ‘సమానత్వ భావన’ పేరుతో యూజీసీ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. భారత అత్యున్నత న్యాయస్థానం కీలక జోక్యం చేసుకుంది. ఈ కొత్త రూల్స్ అమలుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు వాటికి కళ్లెం వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ కొత్త నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని తేల్చిచెప్పింది.
వివాదాస్పద నిబంధనలు.. కోర్టు సీరియస్ : యూనివర్సిటీలు, కాలేజీల్లో సమానత్వ భావనను (Equity) పెంపొందించే ఉద్దేశంతో యూజీసీ ఇటీవల రూపొందించిన కొత్త రూల్స్ ఆశించిన లక్ష్యానికి విరుద్ధంగా ఉన్నాయన్న వాదనలు బలంగా వినిపించాయి. ఈ నిబంధనలు కొన్ని వర్గాల విద్యార్థుల్లో అభద్రతా భావాన్ని రేకెత్తిస్తున్నాయని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిని విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. “ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కొత్త నిబంధనలు వివాదాస్పదంగా కనిపిస్తున్నాయి. వీటి అమలు వల్ల విద్యా వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉంది,” అని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది.
స్టే విధిస్తూ.. కేంద్రానికి నోటీసులు : పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, యూజీసీ జారీ చేసిన నోటిఫికేషన్‌పై మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణ జరిగి, తుది తీర్పు వచ్చే వరకు పాత నిబంధనలే అమల్లో ఉంటాయని, కొత్త రూల్స్ జోలికి వెళ్లొద్దని యూజీసీని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు ఈ నిబంధనలను ఎందుకు కఠినతరం చేయాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న హేతుబద్ధత ఏంటి? అని ప్రశ్నిస్తూ కేంద్రానికి, యూజీసీకి నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జనరల్ కేటగిరీ విద్యార్థులు, విద్యావేత్తల నుంచి ఈ రూల్స్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివక్ష పేరుతో చిన్న చిన్న అంశాలను కూడా క్రిమినల్ కేసులుగా మార్చే అవకాశం ఉందన్న ఆందోళన వారిలో ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘స్టే’ ఉత్తర్వులు విద్యార్థి లోకానికి, యూనివర్సిటీల యాజమాన్యాలకు తాత్కాలికంగా పెద్ద ఊరటనిచ్చాయి. న్యాయస్థానం తదుపరి విచారణలో ఎలాంటి తీర్పు వెలువరించనుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

