Supreme Court Suggests Jailing Farmers: ప్రతి ఏటా శీతాకాలం ఆరంభంలో దేశ రాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం (స్టబుల్ బర్నింగ్) ఈ సమస్యకు ప్రధాన కారణంగా ఉన్న నేపథ్యంలో, దీనికి చరమగీతం పాడాలంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. “కొందరు రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే, అది మిగతా వారికి బలమైన సందేశాన్ని పంపుతుంది. ఇతరులకు ఇదొక హెచ్చరికగా పనిచేస్తుంది” అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.
ALSO READ: Election Commission : ఓటర్లకు ఈసీ ఊరట.. దేశవ్యాప్త SIRలో సగం మందికి పత్రాలు అవసరం లేదు!
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీలు, ప్రత్యామ్నాయ యంత్రాలు అందిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదని అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సీజేఐ, “పర్యావరణాన్ని పరిరక్షించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉంటే, శిక్షా నిబంధనలను అమలు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నాయి? రైతులు మనకు అన్నం పెట్టే ప్రత్యేకమైన వ్యక్తులే. వారికారణంగానే మనం తింటున్నాం. కానీ, దానర్థం వారు దీన్ని అలుసుగా తీసుకోకూడదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా, గత కొన్నేళ్లుగా పంట వ్యర్థాల దహనం కేసులు తగ్గాయని, ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని తెలిపారు. “చిన్న, సన్నకారు రైతులను అరెస్ట్ చేస్తే వారిపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏంటి?” అని ఆయన ప్రశ్నించారు. దీనికి ధర్మాసనం బదులిస్తూ, “మేము అందరినీ అరెస్ట్ చేయమని చెప్పడం లేదు. కేవలం ఒక బలమైన సందేశం పంపేందుకే ఈ సూచన చేస్తున్నాం” అని స్పష్టం చేసింది.
అనంతరం, కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు తమ నివేదికలను సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ALSO READ: J&K High Court : ఉగ్రవాద బాధితులకు ఊరట.. రెండు నెలల్లో పరిహారం చెల్లించాల్సిందే!


