తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో(Supreme Court) భారీ ఊరట దక్కింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ రవి(Governor RN Ravi) ఆమోదించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ చర్య చట్ట విరుద్ధం, ఏకపక్షం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లులు నిలిపివేసిన తేదీ దగ్గర నుంచి ఆమోదం పొందినట్లు పరిగణించబడుతుందని జస్టిస్ జెబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో జాప్యం వల్ల గవర్నర్, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టాలిన్ ప్రభుత్వం పంపించిన 10 కీలక బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ అడ్డుకున్నారు. దీంతో ఈ చర్యను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారించిన న్యాయస్థానం గవర్నర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.