SC To Examine PIL For ‘Income-Based’ Reservation System: దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల విధానంలో మార్పులు కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. రిజర్వేషన్లను ఆర్థిక ప్రాతిపదికన వర్గీకరిస్తూ విధానాలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. ఈ పిల్‌పై అక్టోబర్ 10లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
రామాశంకర్ ప్రజాపతి, యమునా ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన ఈ పిల్‌లో పలు కీలక అంశాలను లేవనెత్తారు. దశాబ్దాలుగా అమలు చేస్తున్న రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలోని ఆర్థికంగా వెనుకబడిన వారికి పూర్తి ప్రయోజనాలు అందడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ వర్గాల్లో ఇప్పటికే ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన స్థితిలో ఉన్నవారే రిజర్వేషన్ల ఫలాలను పొందుతున్నారని, అత్యంత పేద వర్గాలు ఇంకా వెనుకబడే ఉన్నారని వారు వివరించారు.
ఈ పిటిషన్ ద్వారా కుల ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరడం లేదని, అయితే వాటిలో ఆర్థిక ప్రాధాన్యతను చేర్చడం ద్వారా అత్యంత నిరుపేదలకు ముందుగా సహాయం అందేలా చూడాలని కోరారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16లకు మరింత బలాన్ని ఇస్తుందని పిటిషనర్లు వాదించారు. ఈ పిల్‌కు తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.


