జెడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్ తో అంబానీలకు రక్షణ కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో మనదేశంలో అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ కుటుంబానికి దేశంలో, విదేశాల్లో కూడా ఈ స్థాయి భద్రతను కల్పించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ కల్పించాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది.
అయితే స్వదేశంలో, విదేశంలో ఈ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించేందుకు అయ్యే ఖర్చులను మాత్రం అంబానీలే భరించాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే అంబానీలకు కల్పిస్తున్న భద్రతపై పలు వివాదాలున్న నేపథ్యంలో ఈమేరకు జస్టిస్ క్రిష్ణ మురారీ, అహసనుద్దీన్ అమానుల్లా ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు అవసరమైన చర్యలను హోంశాఖం తీసుకోవాల్సిందిగా స్పష్టమైన నిర్దేశకాలు వెలువడ్డాయి. భద్రత అనేది ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కారాదని వివరణ సైతం ఇచ్చింది.
అంబానీ భద్రతపై కేంద్ర హోంశాఖ, కేంద్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు పదేపదే పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పలు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ స్పష్టత అత్యవసరంగా మారింది.