Youngest Indian swims English Channel : చిన్న వయసులో పిల్లలు ఆటపాటలతో గడిపేస్తుంటే, ఆ వయసులోనే సముద్రమంత సాహసానికి సిద్ధపడితే..? అదీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జలసంధిని జయించాలని లక్ష్యంగా పెట్టుకుంటే..? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఓ భారతీయ బాలుడు. 14 ఏళ్లకే అసామాన్య ప్రతిభతో ఇంగ్లిష్ ఛానల్‌ను ఈది, సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఇంతకీ ఎవరా అఖిలేశ్..? ఈ సాహసయాత్రను కేవలం 12 గంటల్లోనే ఎలా పూర్తి చేయగలిగాడు…?
విజయం వెనుక అకుంఠిత దీక్ష : తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల అఖిలేశ్, ప్రపంచంలోని అత్యంత సవాలుతో కూడిన ఓపెన్-వాటర్ స్విమ్‌లలో ఒకటైన ఇంగ్లిష్ ఛానల్‌ను విజయవంతంగా ఈదాడు. దక్షిణ ఇంగ్లాండ్ నుంచి ఉత్తర ఫ్రాన్స్ వరకు విస్తరించి ఉన్న 42 కిలోమీటర్ల ఈ కఠినమైన జలసంధిని కేవలం 12 గంటల 10 నిమిషాల్లో పూర్తి చేయడం ఒక అద్భుతమైన ఘనత. జూలై 29న, సుమారు 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న గడ్డకట్టే చల్లని నీటిలో ఈ సాహసాన్ని పూర్తిచేశాడు.
ఈ చరిత్రాత్మక ఘనతను అఖిలేశ్‌తో పాటు భారత్‌కు చెందిన మరో ఇద్దరు, బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు, రష్యాకు చెందిన ఒకరితో కూడిన ఆరుగురు సభ్యుల రిలే బృందం సాధించింది.అయితే, ఇంత చిన్న వయసులో ఈ ఘనతను సాధించిన వ్యక్తిగా అఖిలేశ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
కన్నవారి ప్రోత్సాహం, కోచ్ శిక్షణ : ఇంగ్లిష్ ఛానల్ విజయం తర్వాత శుక్రవారం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న అఖిలేశ్‌కు అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, కోచ్ గుగనాథన్ ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ, “ఈ విజయం వెనుక మా నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. చెన్నై వేళచ్చేరిలోని ఈత శిక్షణా కేంద్రంలో కఠినమైన శిక్షణ తీసుకున్నాను” అని తెలిపాడు. తమిళనాడు, భారతదేశం గర్వపడేలా మరిన్ని విజయాలు సాధిస్తానని అతను ధీమా వ్యక్తం చేశాడు. తనకు మద్దతుగా నిలిచిన తమిళనాడు క్రీడాభివృద్ధి సంస్థకు, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
అఖిలేశ్ కోచ్ గుగనాథన్ మాట్లాడుతూ, “అఖిలేశ్ విజయం పట్ల చాలా గర్వంగా ఉంది. ఇంగ్లిష్ ఛానల్‌లోని ఉష్ణోగ్రతలకు అలవాటు పడేందుకు గత రెండేళ్లుగా ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రపంచంలోనే అత్యంత సవాలుతో కూడిన ఈ ఛానల్‌ను ఈదిన యువ భారతీయుల జాబితాలో ఇప్పుడు అఖిలేశ్ కూడా చేరాడు” అని అన్నారు.
మరో భారతీయ విద్యార్థిని అఫ్రీన్ జబీ విజయం : అదే రోజు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) విద్యార్థిని అఫ్రీన్ జబీ కూడా ఇంగ్లిష్ ఛానల్‌ను విజయవంతంగా ఈదారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అఫ్రీన్, యూకేలోని డోవర్ నుంచి ఫ్రాన్స్‌లోని క్యాప్ గ్రిస్-నెజ్ వరకు ఉన్న 34 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల 13 నిమిషాల్లో పూర్తి చేశారు.ఈ ఘనత సాధించిన తొలి ఏఎంయూ విద్యార్థినిగా ఆమె చరిత్ర సృష్టించారు.


