Tamil Nadu political criticism : తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు వరుణుడి ప్రతాపానికి రైతన్నల బతుకులు నీటి పాలవుతుంటే, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమా విమర్శకుడి అవతారమెత్తారంటూ ప్రతిపక్ష నేత పళనిస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల గోడును గాలికి వదిలేసి, స్టాలిన్ సినిమా రివ్యూలు ఇచ్చుకుంటున్నారన్న పళనిస్వామి వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసలు పళనిస్వామి ఆరోపణలేంటి? వాటిపై స్టాలిన్ స్పందన ఏంటి? ఈ మాటల యుద్ధం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలేమిటి?
‘విమర్శకుడి’ అవతారంలో సీఎం: పళనిస్వామి : ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నాయకుడు కె. పళనిస్వామి, సీఎం స్టాలిన్ తీరుపై ఘాటుగా స్పందించారు. కుండపోత వర్షాలకు రాష్ట్రంలో 31 మంది ప్రాణాలు కోల్పోయారని, కోతకొచ్చిన వరి ధాన్యం మొలకెత్తి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“రైతులు పంపిన మొలకెత్తిన ధాన్యం ఫొటోలు చూసి నా గుండె తరుక్కుపోయింది. అలాంటి సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి, ఇటీవల ‘బైసన్’ అనే సినిమా చూసి చిత్ర బృందాన్ని అభినందించడంలో తీరిక లేకుండా ఉన్నారు” అని పళనిస్వామి ఎద్దేవా చేశారు. గతంలో పారిశుద్ధ్య కార్మికులు నిరసనలు తెలుపుతుంటే రజినీకాంత్ ‘కూలీ’ సినిమా చూశారని, ఇప్పుడు రైతులు గగ్గోలు పెడుతుంటే ‘బైసన్’ సినిమా చూస్తున్నారని ఆరోపించారు. ‘జై భీమ్’, ‘కూలీ’ వంటి సినిమాలు చూడటానికి సమయం ఉంటుంది కానీ, రైతుల సమస్యలు పట్టించుకోవడానికి మాత్రం సీఎంకు తీరిక ఉండటం లేదని, అసలు తానెందుకు ముఖ్యమంత్రి అయ్యారో స్టాలిన్ మర్చిపోయారని విమర్శించారు.
విపత్తులోనూ రాజకీయాలా?: స్టాలిన్ ఎదురుదాడి : పళనిస్వామి చేసిన వ్యాఖ్యలపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈశాన్య రుతుపవనాలతో రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంటే, పళనిస్వామి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం సేకరణపై పళనిస్వామి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని, వాటిని పట్టించుకోకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్టాలిన్ స్పష్టం చేశారు.
‘ఓట్ల చోరీ’కి ప్రతిపక్షాల కుట్ర : అదే సమయంలో సీఎం స్టాలిన్, ప్రతిపక్షాలపై మరో తీవ్ర ఆరోపణ చేశారు. రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను అడ్డం పెట్టుకుని, బీజేపీ, అన్నాడీఎంకేలు ఓట్ల చోరీకి పాల్పడాలని చూస్తున్నాయని ఆరోపించారు. “బిహార్‌లో ఇదే తరహా ఎస్ఐఆర్ వల్ల 65 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారు. అదే వ్యూహాన్ని ఇక్కడ అమలు చేసి శ్రామికులు, ఎస్సీలు, మైనారిటీలు, మహిళల ఓట్లను తొలగించి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. కానీ తమిళనాట వారి పప్పులుడకవు” అని స్టాలిన్ హెచ్చరించారు. అయితే, ఈ ఆరోపణలను పళనిస్వామి తోసిపుచ్చారు.


