HomeTop StoriesSupreme Court : 'తెహెల్కా' మాజీ ఎడిటర్‌కు దక్కని ఊరట.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court : ‘తెహెల్కా’ మాజీ ఎడిటర్‌కు దక్కని ఊరట.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court surrender order : పదేళ్ల నాటి అత్యాచార కేసులో ఊరట లభిస్తుందని భావించిన ‘తెహెల్కా’ మాజీ ప్రధాన సంపాదకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జైలుకెళ్లకుండా అప్పీల్‌పై విచారణ జరిపించాలన్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. బాంబే హైకోర్టు విధించిన పదేళ్ల కఠిన కారాగార శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన న్యాయపోరాటం ఎందుకు బెడిసికొట్టింది? సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలేమిటి?

- Advertisement -

మినహాయింపు పిటిషన్‌ తిరస్కరణ : తన అప్పీల్‌పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు లొంగిపోవడం నుంచి మినహాయింపు ఇవ్వాలని తేజ్‌పాల్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే ధర్మాసనాన్ని కోరారు. అయితే, నేరం తీవ్రత దృష్ట్యా ఎలాంటి సడలింపులూ ఇవ్వలేమని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. రెండు వారాల వ్యవధిలో సంబంధిత కోర్టు ఎదుట లొంగిపోయి, అందుకు సంబంధించిన ‘సరెండర్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాలని స్పష్టం చేసింది.

సెప్టెంబర్‌ 22న ప్రధాన అప్పీల్‌పై విచారణ తేజ్‌పాల్‌ లొంగిపోయినట్లు ధ్రువీకరణ పత్రం అందితేనే, బాంబే హైకోర్టు ఇచ్చిన దోష నిర్ధారణ తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన క్రిమినల్‌ అప్పీల్‌ను సెప్టెంబర్‌ 22న విచారణకు స్వీకరిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. గోవా ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ, తీవ్రమైన అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి లొంగుబాటు నుంచి మినహాయింపు ఇవ్వరాదని గట్టిగా వ్యతిరేకించారు.

కేసు నేపథ్యం : 2013లో గోవాలోని ఓ స్టార్ హోటల్ లిఫ్ట్‌లో సహచర జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న కేసులో ట్రయల్‌ కోర్టు తేజ్‌పాల్‌ను 2021లో నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, ఆ తీర్పును బాంబే హైకోర్టు రద్దు చేస్తూ ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. లిఫ్ట్ సీసీటీవీ ఫుటేజ్, ఈమెయిళ్లను ప్రస్తావిస్తూ ఆయన వాదించినప్పటికీ, ముందుగా జైలుకు వెళ్లాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఆయనకు లొంగుబాటు అనివార్యమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News