ఈ రోజుల్లో రైలు టికెట్ పొందాలంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం తప్పనిసరిగా మారిపోయింది. దేశంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ కోసం పోటీ పెరిగిపోయింది. టికెట్ ఖాళీగా దొరికే అవకాశాలు తగ్గిపోతుండటంతో, తత్కాల్ స్కీమ్ ద్వారా చివరి నిమిషంలోనైనా టికెట్ బుక్ చేసుకునే దిశగా ప్రయాణికులు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి భారతీయ రైల్వే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 15 నుంచి తత్కాల్ బుకింగ్ సమయాల్లో మార్పులు జరిగనున్నట్టు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తెలిపింది. ఇప్పటి వరకు ఏసీ క్లాస్‌లకు తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుండగా, ఇప్పుడు దానిని ఒక గంట ఆలస్యంగా ఉదయం 11 గంటలకు మార్చారు. అలాగే స్లీపర్, సెకండ్ సిట్టింగ్ (2S) క్లాస్‌ల బుకింగ్ సమయం కూడా మారింది. ఇది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు షిఫ్ట్ అయింది.
ప్రీమియం తత్కాల్ బుకింగ్‌కు సంబంధించి కూడా మార్పు వచ్చింది. ఇప్పటి వరకు ఇది ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుండగా, ఇకపై 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. రిజర్వేషన్‌కు సంబంధించిన ఈ కొత్త షెడ్యూల్ ఏప్రిల్ 15 నుంచే అమల్లోకి రానున్నది. అందువల్ల రైలు ప్రయాణం ప్లాన్ చేస్తున్న వారు ఈ తాజా సమయ మార్పులపై అప్రమత్తంగా ఉండాలి. నిర్ణీత సమయానికి ముందుగానే సిద్ధమై టికెట్లు బుక్ చేసుకుంటే, ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు తగ్గుతాయి.