Saturday, November 15, 2025
Homeనేషనల్TCS Layoffs: టీసీఎస్‌లో 12,000 మందికి ఉద్వాసన.. రంగంలోకి కేంద్రం!

TCS Layoffs: టీసీఎస్‌లో 12,000 మందికి ఉద్వాసన.. రంగంలోకి కేంద్రం!

TCS massive layoffs announcement : దేశ ఐటీ రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తూ, ప్రఖ్యాత టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. దాదాపు 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆ సంస్థ సీఈవో కె.కృతివాసన్ చేసిన ప్రకటన ఐటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ అనూహ్య పరిణామంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించి, రంగంలోకి దిగింది. అసలు టీసీఎస్ ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను ఎందుకు తొలగించాలని నిర్ణయించింది.

- Advertisement -

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో అంతర్జాతీయంగా 12,261 మంది ఉద్యోగులను తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నామని టీసీఎస్ సీఈవో కె.కృతివాసన్ అధికారికంగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, ముఖ్యంగా కృత్రిమ మేధ (AI) టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పులే ఈ కఠిన నిర్ణయానికి కారణమని ఆయన పేర్కొన్నారు.

“సంస్థను భవిష్యత్తుకు అనుగుణంగా తీర్చిదిద్దే ప్రయాణంలో మేం ఉన్నాం. అందులో భాగంగా మా సిబ్బందికి నూతన సాంకేతికతల్లో నిరంతరం శిక్షణ ఇస్తున్నాం. అయితే, కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో, కొంతమందిని తొలగించక తప్పడం లేదు” అని టీసీఎస్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మొత్తం 6,13,069 మంది ఉద్యోగుల్లో ఈ తొలగింపులు కేవలం 2 శాతానికి మాత్రమే సమానమని, ఈ ప్రభావం ప్రధానంగా మధ్య, సీనియర్ స్థాయి మేనేజర్లపై అధికంగా ఉండే అవకాశం ఉందని సంస్థ స్పష్టం చేసింది.

దేశంలో ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తీవ్రంగా దృష్టి సారించింది. మొత్తం పరిస్థితిని కేంద్రం నిశితంగా గమనిస్తోందని, ఇప్పటికే టీసీఎస్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం (ELI) వంటి కార్యక్రమాల ద్వారా ఉద్యోగావకాశాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అదే సమయంలో నైపుణ్య శిక్షణ, పునఃనైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, టీసీఎస్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను లోతుగా అధ్యయనం చేసి, తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad