Saturday, November 15, 2025
Homeనేషనల్Ideal Teacher : పాము కాటు.. పాఠం బాట! 28 ఏళ్లుగా అడవిలోనే అక్షర యజ్ఞం!

Ideal Teacher : పాము కాటు.. పాఠం బాట! 28 ఏళ్లుగా అడవిలోనే అక్షర యజ్ఞం!

Teacher’s 28 years of service in the forest :  నగరాల్లో సౌకర్యవంతమైన ఉద్యోగాల కోసం ఉపాధ్యాయులు బదిలీలపై వెళ్లే ఈ రోజుల్లో, ఓ గురువు మాత్రం కనీస వసతులు లేని కీకారణ్యాన్ని తన కర్మభూమిగా ఎంచుకున్నారు. పాము కాటు వేసినా, క్రూర మృగాలు ఎదురైనా పాఠం చెప్పడం ఆపలేదు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 28 ఏళ్లుగా ఆ అడవి బిడ్డలకు అక్షర జ్ఞానాన్ని పంచుతూ, ఆ గ్రామ రూపురేఖలనే మార్చేస్తున్నారు. ఆయనే నింగప్ప బలేకుండరిగి. ఇంతకీ, సౌకర్యాల ప్రపంచాన్ని కాదని, కష్టాల కీకారణ్యాన్ని ఆయన ఎందుకు ఎంచుకున్నారు..?

- Advertisement -

ఆరంభంలోని సవాళ్లు : సుమారు 28 ఏళ్ల క్రితం, 1997లో, నింగప్ప కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని భీమాగఢ్ అభయారణ్యంలో ఉన్న అమగావ్ అనే మారుమూల గ్రామానికి ఉపాధ్యాయుడిగా వచ్చారు. అప్పట్లో ఆ గ్రామానికి రోడ్డు, కరెంట్, కనీసం ఫోన్ సిగ్నల్ కూడా లేవు.

భాషా సమస్య: గ్రామంలో అందరూ మరాఠీ మాట్లాడతారు. కన్నడ మాత్రమే తెలిసిన నింగప్పకు ఇది పెను సవాలుగా మారింది. అయినా, పట్టు వదలకుండా గ్రామస్థులతో, పిల్లలతో మాట్లాడుతూ నెమ్మదిగా మరాఠీ నేర్చుకుని పాఠాలు చెప్పడం ప్రారంభించారు.

గ్రామస్థుల ప్రేమ: “ఇక్కడి ప్రజలు చాలా అమాయకులు. నాకోసం ఉచితంగా ఓ ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు. అందుకే బదిలీ కోసం నేనెప్పుడూ దరఖాస్తు చేసుకోలేదు,” అని నింగప్ప గర్వంగా చెబుతారు.

ప్రాణాలకు ఎదురొడ్డి : ఆయన ప్రయాణం పూలపాన్పు కాదు. వారానికి ఒక్కరోజు మాత్రమే ఇంటికి వెళ్లి, మిగిలిన ఆరు రోజులూ ఆ అడవి బడిలోనే గడిపేవారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ప్రాణాలనే పణంగా పెట్టారు.

పాము కాటు: “ఓసారి రాత్రి ఇంట్లో నిద్రపోతున్నప్పుడు పాము కరిచింది. గ్రామస్థులే హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లి నా ప్రాణాలు కాపాడారు,” అని ఆ భయానక ఘటనను గుర్తుచేసుకున్నారు.

క్రూర మృగాలతో సహజీవనం: చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవి పందులు ఆ అటవీ మార్గంలో నిత్యం తారసపడేవని, అయినా తాను వెనకడుగు వేయలేదని ఆయన అంటారు.

కేవలం గురువే కాదు.. గ్రామ సేవకుడు : నింగప్ప కేవలం అక్షరాలు నేర్పే అయ్యవారుగానే మిగిలిపోలేదు. ఆ గ్రామ సమస్యలను తన భుజాలపై వేసుకున్నారు.

గ్రామాభివృద్ధి: ప్రభుత్వ అధికారులకు పదే పదే విన్నవించి, అమగావ్ గ్రామానికి రోడ్డు, విద్యుత్, తాగునీటి వంటి కనీస సౌకర్యాలు కల్పించారు.

ఆర్థిక అండ: “మాస్టారు మా ఊరి పిల్లలకు చదువు చెప్పడమే కాదు, ఎంతోమందికి ఆర్థిక సాయం చేశారు. అనారోగ్యం పాలైన వారిని ఆదుకుని ప్రాణాలు కాపాడారు,” అని గ్రామస్థుడు రూపేశ్ బాలాజీ కృతజ్ఞతతో చెబుతారు.

కలెక్టర్‌తో పోరాటం: వర్షాకాలంలో మూడు నెలల పాటు కరెంట్ ఉండదని, ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారని మరో గ్రామస్థుడు గోవింద్ తెలిపారు.
భార్య, ఉన్నత చదువులు చదువుతున్న ఇద్దరు పిల్లల సంపూర్ణ మద్దతుతోనే తాను ఈ సేవ చేయగలుగుతున్నానని నింగప్ప వినమ్రంగా చెబుతారు. ఆయన ప్రోత్సాహంతో ఇప్పుడు ఆ గిరిజన గూడెం నుంచి ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్నారు. నింగప్ప లాంటి నిస్వార్థ గురువులు ఉన్నంతకాలం, ‘గురుదేవోభవ’ అనే మాటకు సార్థకత చేకూరుతూనే ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad