Teacher Drills class 5 student palm : విద్యార్థులను చదివించేందుకు ఉపాధ్యాయులు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తుంటారు. మొదటగా అర్థం అయ్యేటట్లు చెబుతారు. ఆ తరువాత బెదిరిస్తారు. మరీ మాట వినకపోతే తప్పదు అన్నప్పుడు దండిస్తుంటారు. అయితే.. ఓ టీచర్ విచక్షణ కోల్పోయాడు. ఎక్కాలు సరిగ్గా చెప్పలేదని డ్రిల్లింగ్ మెషీన్‌తో ఓ బాలుడిని గాయపరిచాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
11 ఏళ్ల వివాన్ కాన్పూర్ జిల్లా ప్రేమ్‌నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. రోజులాగానే ఈ నెల 24న పాఠశాలకు వెళ్లాడు. పాఠశాల లైబ్రరీ గుండా వెలుతున్న క్రమంలో టీచర్ అనుజ్ పాండే బాలుడిని లోనికి పిలిచాడు. రెండో ఎక్కం చెప్పమని మందలించాడు. వివాన్ రెండో ఎక్కం చెప్పకపోవడంతో టీచర్ అనుజ్ ఆగ్రహంతో పక్కన ఉన్న మెషిన్ డిల్ర్ తీసుకుని వివాన్ అరచేతిని డ్రిల్ చేశాడు.
ఆ పక్కనే నిలబడి ఉన్న కృష్ణ అనే మరో విద్యార్థి సమయస్పూర్తిని ప్రదర్శించి మెషిన్ డ్రిల్ ఫ్లగ్‌ను తీసేశాడు. పాఠశాల యాజమాన్యం బాలుడికి ప్రథమ చికిత్స అందించి ఇంటికి పంపించి వేశారు. తన స్నేహితుడు సకాలంలో స్పందించకపోతే ఆ డ్రిల్ చాలా లోతుగా దిగేదని వివాన్ చెప్పాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. సదరు టీచర్‌ను స్కూల్‌ను నుంచి తొలగించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేస్తున్నారు.