Homeనేషనల్Droupadi Murmu:ఉపాధ్యాయులే ఫ్రంట్‌లైన్ నేషన్ బిల్డర్స్

Droupadi Murmu:ఉపాధ్యాయులే ఫ్రంట్‌లైన్ నేషన్ బిల్డర్స్

న్యూఢిల్లీ, తెలుగుప్రభ : ఉపాధ్యాయులు దేశానికి ఫ్రంట్‌లైన్ నేషన్ బిల్డర్స్ అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఆమె జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులలో, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల పిల్లల్లో జిజ్ఞాస, నైతిక ప్రవర్తన, ఆత్మవిశ్వాసం, సున్నితత్వాన్ని పెంపొందించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని ఆమె ఉద్ఘాటించారు.

- Advertisement -

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు, మొదటి తరం విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రత్యేక కర్తవ్యం ఉపాధ్యాయులదేనని రాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ సందర్భంగా సావిత్రీబాయి ఫూలే, రవీంద్రనాథ్ ఠాగూర్, ఉత్కళమణి గోపబంధు దాస్ వంటి విద్యా రంగ మార్గదర్శకులను ఆమె స్మరించుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్, గోపబంధు దాస్ స్థాపించిన వన విద్యాలయం (ఓపెన్ ఎయిర్ స్కూల్) ప్రకృతి ఒడిలోనే పిల్లలు సహజంగా ఎదుగుతారనే ఉన్నత భావనకు నిదర్శనాలని ఆమె కొనియాడారు.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 82 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, శిక్షకులకు జాతీయ అవార్డులను అందజేశారు. వీరిలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులు, 21 మంది ఉన్నత విద్యా సంస్థలు,పాలిటెక్నిక్ అధ్యాపకులు కాగా 13 మంది నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ పరిధిలోని నైపుణ్య శిక్షకులు ఉన్నారు. విద్యా ప్రమాణాల పెంపునకు విశేష సేవలందించిన అవార్డు గ్రహీతలందరికీ రాష్ట్రపతి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ, దేశమే ఫస్ట్ అనే స్ఫూర్తితో భావి తరాలను తీర్చిదిద్దాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె.. షేపింగ్ మైండ్స్; బిల్డింగ్ ది ఫ్యూచర్ పేరిట వ్యాసం రాశారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల అత్యున్నత, పవిత్రమైన కర్తవ్యమని ఆమె అందులో పేర్కొన్నారు. నైతిక విలువలు, సత్ప్రవర్తనతో కూడిన విజయాన్ని సాధించే విద్యార్థులే ఉపాధ్యాయుడి విజయానికి సజీవ నిదర్శనాలని రాష్ట్రపతి తెలిపారు. సామాజిక సమ్మిళితత్వాన్ని పునాదిగా చేసుకుంటూ వికసిత్ భారత్ దేశగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోందని ఆమె వివరించారు.

సంస్కృతి, సైన్స్‌కు సమాన ప్రాధాన్యం
ఈ ప్రయాణంలో మన ఉపాధ్యాయులు సరికొత్త తరాలను తీర్చిదిద్దాలని, మన ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూనే, మానవాళి సంక్షేమానికి తోడ్పడే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ‘అంత్యోదయ’ ఆదర్శాలను పాటిస్తూ, పర్యావరణాన్ని, సకల జీవకోటిని సంరక్షించేలా విద్యార్థులను నడిపించాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత, సామూహిక నైపుణ్యాల సాధనతో పాటు నిరంతరం ‘దేశమే ఫస్ట్’ అనే ఆలోచనతో ముందుకు సాగే పౌరులుగా వారిని మలచాలని రాష్ట్రపతి సూచించారు.

ఉపాధ్యాయుల ప్రవర్తన పిల్లల్లో భయాందోళనలు, న్యూనతా భావాన్ని కలిగించేలా ఉండకూడదని హితవు పలికారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా శక్తిని ప్రోత్సహించడం, ప్రశ్నలు అడిగే తత్వాన్ని రేకెత్తించడం, తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా మాత్రమే నవ సమాజ సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు చూపే శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు వెలుగులోకి వస్తారని రాష్ట్రపతి ఆకాంక్షించారు. దేశ ప్రజలందరూ నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ గౌరవించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News