Period Pills -Young Women:ఆరోగ్యం విషయంలో చాలాసార్లు జాగ్రత్తలు పట్టించుకోకపోవడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన వైద్యులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం ఎంతటి భయంకర ఫలితాలను కలిగిస్తుందో తెలుస్తోంది.
“రీబూటింగ్ ది బ్రెయిన్”..
ఆగస్టు 14న విడుదలైన “రీబూటింగ్ ది బ్రెయిన్” పాడ్‌కాస్ట్‌లో వైద్యులు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) గురించి చర్చించారు. ఇది సాధారణంగా పెద్దగా కనిపించని సమస్యలా అనిపించినా, శరీరంలోని లోతైన సిరల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల అకస్మాత్తుగా ప్రాణాపాయం కలిగించే ప్రమాదకర వ్యాధి. ఈ చర్చ సందర్భంగా ఆయన ఒక 18 ఏళ్ల యువతి విషాదకర గాథను గుర్తు చేశారు.
పీరియడ్స్ ఆగడానికి…
ఆ అమ్మాయి మొదట కాలులో తీవ్రమైన నొప్పితో ఆసుపత్రిని ఆశ్రయించింది. ఆమె స్నేహితులు మాత్రమే ఉన్నారు, తల్లిదండ్రులు లేరు. డాక్టర్ ఆమెతో మాట్లాడినప్పుడు, ఒక మతపరమైన కార్యక్రమం కోసం పీరియడ్స్ ఆగడానికి హార్మోనల్ మాత్రలు వేసుకున్నానని చెప్పింది. ఈ మాత్రలు అరుదుగా అయినా రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయని వైద్యులు వివరించారు.
మాత్రలు వేసిన కేవలం మూడు రోజుల్లోనే ఆమె శరీరంలో రక్తప్రవాహం సరిగా లేక గడ్డ ఏర్పడి కాలి నుండి నాభి వరకు విస్తరించింది. డాక్టర్ వెంటనే స్కాన్ చేయించగా, పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నట్లు తేలింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చాలని డాక్టర్ సూచించారు. కానీ సమస్య ఇక్కడే వచ్చింది.
“రేపు ఉదయం చూస్తాం”..
డాక్టర్ ఫోన్ చేసి తండ్రికి వివరించగా, ఆయన నిర్లక్ష్యంగా “రేపు ఉదయం చూస్తాం” అని చెప్పారని వెల్లడించారు. ఆ సమయంలోనే చికిత్స మొదలై ఉంటే ప్రాణం కాపాడే అవకాశం ఉండేది. కానీ ఆసుపత్రిలో చేర్చకపోవడంతో పరిస్థితి మరింత క్షీణించింది.ఆ రాత్రి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అమ్మాయి అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లి ఊపిరి ఆడక ఎమర్జెన్సీ విభాగానికి తరలించారు. అక్కడికి చేరుకునే సమయానికి పరిస్థితి అదుపులో ఉండకపోవడంతో ఆమె ప్రాణాలు నిలుపలేకపోయారు.
డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అంటే ఏమిటి?
ఇది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. కాళ్లలోని లోతైన సిరల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల రక్తప్రవాహం అడ్డంకి ఏర్పడుతుంది. ఈ గడ్డ ఊపిరితిత్తుల్లోకి చేరితే పల్మనరీ ఎంబోలిజం అనే అత్యంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో శ్వాస ఆడక అకస్మాత్తుగా మరణించే అవకాశం ఉంది.
Also Read: https://teluguprabha.net/national-news/rahul-tejashwi-voter-adhikar-yatra-bihar-bjp-criticism/


