Tej Pratap Yadav’s political shift : బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరిన వేళ, రాజకీయ క్షేత్రంలో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాజకీయంగా బద్ధ శత్రువులైన రెండు శిబిరాలకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకేచోట కలవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, బీజేపీ ఎంపీ, భోజ్‌పురి సూపర్‌స్టార్ రవి కిషన్‌తో ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన పలకరింపా? లేక తెరవెనుక ఓ కొత్త రాజకీయ సమీకరణానికి నాంది పలుకుతున్న సంకేతమా? కుటుంబంలో ప్రాధాన్యం దక్కక అసంతృప్తితో ఉన్న తేజ్ ప్రతాప్, కమలదళం వైపు చూస్తున్నారా? యాదవ ఓటు బ్యాంకును చీల్చేందుకు బీజేపీ పన్నిన వ్యూహంలో ఇది భాగమా?
శుక్రవారం పట్నా విమానాశ్రయం బిహార్ రాజకీయాల్లో ఓ ఆసక్తికర ఘట్టానికి వేదికైంది. లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్ పరస్పరం కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించారు. ఈ భేటీ అనంతరం వారిద్దరూ మీడియా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
శివభక్తితో మొదలైన మాటలు.. రాజకీయ సంకేతాలతో ముగింపు : మీడియా ప్రతినిధులతో తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ, “రవి కిషన్‌ను కలవడం ఇదే తొలిసారి. మేమిద్దరం శివభక్తులం. నుదుటిపై ఒకేలాంటి బొట్టు పెట్టుకుంటాం” అంటూ భక్తి కోణంలో తమ భేటీని అభివర్ణించారు. అయితే, ‘మీరు బీజేపీతో చేతులు కలుపుతారా?’ అని ప్రశ్నించగా, “బిహార్‌లో నిరుద్యోగాన్ని నిర్మూలించే ఎవరితోనైనా నేను కలుస్తాను” అంటూ రాజకీయంగా కీలకమైన, గూఢార్థంతో కూడిన సమాధానమిచ్చారు.
మరోవైపు, బీజేపీ ఎంపీ రవి కిషన్ కూడా అంతే వ్యూహాత్మకంగా స్పందించారు. తేజ్ ప్రతాప్ బీజేపీతో కలుస్తారా అని అడగ్గా… “ఏదైనా జరగొచ్చు. భోలేనాథ్ భక్తులందరి కోసం బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలుపులు తెరిచి ఉంచారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనుకునే వారికి మా పార్టీలో ఎప్పుడూ స్వాగతం ఉంటుంది,” అని వ్యాఖ్యానించి కొత్త చర్చకు తెరలేపారు.
అసంతృప్తే కారణమా? బీజేపీ వ్యూహమా : లాలూ కుటుంబ రాజకీయాల్లో తన తమ్ముడు తేజస్వి యాదవ్‌కు అధిక ప్రాధాన్యం లభిస్తోందని, తనకు సముచిత స్థానం దక్కడం లేదని తేజ్ ప్రతాప్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ‘జనశక్తి జనతా దళ్’ పేరుతో సొంత పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ఆయన బలమైన మిత్రుల కోసం అన్వేషిస్తున్నారు. కాంగ్రెస్ సహా ప్రధాన విపక్షాలన్నీ ఆర్‌జేడీతోనే ఉండటంతో, ఆయనకు బీజేపీ తప్ప మరో బలమైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీ లక్ష్యం యాదవ ఓటుబ్యాంకేనా : ఈ భేటీ వెనుక బీజేపీ పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బిహార్‌లో ఆర్‌జేడీకి ప్రధాన బలం ముస్లిం-యాదవ (M-Y) ఓటుబ్యాంకు. లాలూ కుటుంబంలో అసంతృప్తితో ఉన్న తేజ్ ప్రతాప్‌ను తమవైపు తిప్పుకోవడం ద్వారా, యాదవ ఓటుబ్యాంకును చీల్చవచ్చని కమలదళం భావిస్తోంది. ఎన్నికల కీలక తరుణంలో ఈ భేటీ జరగడం ఆ వ్యూహంలో భాగమేనని, ఇది రానున్న రోజుల్లో బిహార్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.


