Sunday, November 16, 2025
Homeనేషనల్Tejashwi Yadav: అన్ని స్థానాల్లో మేమే పోటీ చేస్తాం.. పొత్తుకు విరుద్ధంగా తేజస్వీ యాదవ్‌ సంచలన...

Tejashwi Yadav: అన్ని స్థానాల్లో మేమే పోటీ చేస్తాం.. పొత్తుకు విరుద్ధంగా తేజస్వీ యాదవ్‌ సంచలన ప్రకటన

Tejashwi Yadav Announces RJD to Contest All Assembly Seats: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష మహాఘట్ బంధన్‌ కూటమిలో సీట్ల పంపకం ఇంకా పూర్తి కాలేదు. ఈలోపే ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేసి హాట్ టాపిక్‌గా నిలిచారు. శనివారం ముజఫర్‌పూర్‌ కాంతిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈసారి బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేశారు. తేజస్వి ముఖం చూసి ఓటు వేయాలని బీహార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీంతో, కాంగ్రెస్‌, వామపక్ష, జార్ఖండ్ ముక్తి మోర్చా, లోక్ జనశక్తి పార్టీ పార్టీల్లో అలజడి రేగింది. తమతో సంప్రదించకుండా, పొత్తు ధర్మం పాటించకుండా తేజస్వి ఇలాంటి ప్రకటన చేయడాన్ని ఆయా పార్టీలు తప్పుపడుతున్నాయి.

- Advertisement -

ప్రభుత్వంపై విరుచుకుపడ్డ తేజస్వి..

ఈ బహిరంగ సభలో తేజస్వి యాదవ్ ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం కేవలం నినాదాలతోనే ప్రజలను మభ్యపెడుతోందన్నారు. బీహార్ నుంచి ఓట్లు, గుజరాత్‌లో ఫ్యాక్టరీలు.. ఇలాంటి ఎత్తుగడలు ఇక పని చేయవని వ్యాఖ్యానించారు. ఆర్‌జేడీ అధికారంలోకి వస్తే ఉపాధి, అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం 80 వేల కోట్ల రూపాయల లెక్కలు చూపడం లేదని తేజస్వి ఆరోపించారు. ఈ ప్రభుత్వం అవినీతి తిమింగాలకు రక్షణ కల్పిస్తోందని, అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంతిలో బీఆర్‌ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మహిళలకు ఏటా లక్షన్నర ఇస్తాం..

ప్రభుత్వం తమ ఒత్తిడితోనే పెన్షన్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రకటించిందని తేజస్వి అన్నారు. ఆర్‌జేడీ మై బెహన్ యోజనను కాపీ చేస్తూ ప్రభుత్వం 10 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిందన్నారు. కానీ తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ప్రతి మహిళకు లక్షన్నర రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అందరం కలిసి కట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/jubilee-hills-by-election-anjan-kumars-condition-for-minister-post-danam-nagenders-intriguing-statement/

సీట్ల పంపకంలో గందరగోళం..

మహాఘట్ బంధన్‌ కూటమిలో సీట్ల పంపకం ఇంకా ఖరారు కానప్పటికీ.. తేజస్వి ఇలాంటి ప్రకటన చేయడం సంచలనంగా మారింది. కూటమిలో ఏం జరుగుతుందో తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు. 2020 ఎన్నికల్లో ఆర్‌జేడీ 144 సీట్లలో పోటీ చేసి 75 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ మొత్తం 70 సీట్లలో పోటీ చేసి 19 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ ఓటర్ల హక్కులపై ఓట్ల చోరీ అనే విషయంపై బలంగా పోరాడింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ బలపడిందని కాంగ్రెస్ నమ్ముతోంది. దీంతో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా, లోక్ జనశక్తి పార్టీ వంటి కొత్త పార్టీలు కూడా ఈసారి ఈ కూటమిలో భాగమయ్యాయి. ఈ క్రమంలోనే తేజస్వి యాదవ్ 243 సీట్లలోనూ పోటీ చేస్తామని చేసిన ప్రకటన కూటమిలో గందరగోళాన్ని సృష్టించింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని, ఇది పొత్తు ధర్మానికి వ్యతిరేకమని కాంగ్రెస్‌ నేతలు పెదవి విరుస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad