ఢిల్లీలోని పాక్ హైకమిషనర్(Pakistan High Commission) కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పహల్గాం ఉగ్రదాడిని(Pahalgam Terror Attack) నిరసిస్తూ యాంటీ టెర్రర్ యాక్షన్ ఫోరమ్ ఆందోళన చేపట్టింది. పాకిస్తాన్ దేశానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)ను స్వాధీనం చేసుకోవడానికి ఇదే తగిన సమయం అని చెబుతున్నారు. ఉగ్రవాదాని ప్రోత్సహిస్తున్న దాయాది దేశంపై మరో సర్జికల్ స్ట్రైక్ లాంటి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హైకమిషన్ వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. హైకమిషన్ నుండి 500 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకున్నారు.
కాగా ఇప్పటికే పాక్ హైకమిషన్‌ను ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. భారత్ నోటీసులతో పాక్ అధికారులు హైకమిషన్ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. మరోవైపు పాక్‌తో అన్ని సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది. సింధూ నది జలాల ఒప్పందం రద్దుతో పాటు పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.