పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో(India-Pakistan Border) ఉద్రిక్తతలు తలెత్తాయి. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి పలు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. అయితే పాక్ సైన్యం కాల్పులకు భారత ఆర్మీ దీటుగా బదులిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి వెల్లడించారు.
మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని బందిపొరాలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కుల్నార్ బజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో జవాన్లను చూసిన ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్, ఉదమ్‌పూర్‌లో పర్యటిస్తున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.