Thackeray Cousins To Contest Mumbai Civic Polls Together: మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకున్నాయి. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)తో పాటు ఇతర ప్రధాన నగరాలైన థానే, నాసిక్, కళ్యాణ్-డోంబివాలిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరేలు కలిసి పోటీ చేయనున్నారు. ఈ మేరకు స్పష్టం చేసిన శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నేత సంజయ్ రౌత్ తమను ఏ శక్తీ విడదీయలేదని విశ్వాసం వ్యక్తం చేశారు.
రెండు దశాబ్దాల క్రితం రాజ్ థాకరే శివసేన నుంచి బయటకు వచ్చారు. ఇటీవల మహారాష్ట్రలో మరాఠీ గుర్తింపు, హిందీ భాష బలవంతంగా రుద్దడంపై చర్చలు మొదలవడంతో ఈ ఇద్దరు సోదరుల మధ్య సయోధ్య కుదిరింది.
“థాకరే సోదరుల ఐక్యత మరాఠీ ప్రజల బలం. ఇప్పుడు ఈ ఐక్యతను ఏ శక్తి కూడా విడదీయలేదు,” అని రౌత్ అన్నారు. ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరేలకి మరాఠీ మాట్లాడే ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉందని ఆయన తెలిపారు.
కలిసి ఉండటానికి వచ్చాం..
కొద్ది రోజుల క్రితం, హిందీ భాషకు సంబంధించిన జీఆర్ (Government Resolution)లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు సోదరులు కలిసి ఒక వేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, “మేము కలిసి ఉండటానికి వచ్చాం, కలిసి ఉంటాం. ముంబైతో పాటు మహారాష్ట్రలోనూ అధికారాన్ని కైవసం చేసుకుంటాం,” అని చెప్పారు.
రాజ్ థాకరే మాట్లాడుతూ, బీజేపీ “విభజించి పాలించు” అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తుందని, భాష, కులం పేరుతో ప్రజలను విడదీయాలని చూస్తుందని ఆరోపించారు.
మరోవైపు, మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత గిరీష్ మహాజన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఎవరైనా విడిపోవచ్చు లేదా కలిసిపోవచ్చు అని వ్యాఖ్యానించారు. పాలక మహా యుతి కూటమి అన్ని ఎన్నికలలో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


