Thalapathy Vijay Announced As CM Canditate: వచ్చే ఏడాది అసెంబ్లీ జరగనున్న తమిళనాడులో రాజకీయాలు అప్పుడే హీటెక్కాయి. ప్రతిసారి తమిళ ప్రధాన పార్టీలు అయిన డీఎంకే, అన్నాడీఎంకే మధ్య మాత్రమే పోటీ ఉండేది. అధికారంలో ఉంటే ఆ పార్టీ.. లేదంటే ఈ పార్టీ మాత్రమే ఉండేది. తంబీలు కూడా ఆ రెండు పార్టీలకే దశాబ్దాల నుంచి అధికారం కట్టబెడుతున్నారు. కానీ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉండనున్నారు. ఎందుకంటే అక్కడి ప్రజలు అమితంగా ప్రేమించే స్టార్ హీరో విజయ్ దళపతి కొత్ పార్టీ పెట్టడమే ఇందుకు కారణం. గతేడాది తమిళ రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని కూడా స్థాపించారు.
ఇప్పటికే నిర్వహించిన తొలి మహానాడులో తాను రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నానో విజయ్ స్పష్టంగా చెప్పారు. తన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు ఏంటో కూడా ప్రకటించారు. అలాగే ప్రతిపక్షా లు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సినిమా హీరోకి రాజకీయాలు ఎందుకనే మాటలకు కూడా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఎంజీఆర్, కరుణానిధి, ఎన్టీఆర్ వంటి వాళ్లు సినిమాల నుంచి ముఖ్యమంత్రులు అయ్యారని గుర్తుచేశారు. ప్రజా మద్దతును ఎవరు చెరిపేయలేరని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
తాజాగా టీవీకే పార్టీ కీలక ప్రకటన చేసింది. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌ని సీఎం అభ్యర్థిగా ఎంచుకున్నట్లు తెలిపింది. ఈమేరకు పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం చేసిందని పేర్కొంది. అంతేకాకుండా ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పపెట్టుకోకుండా సొంతంగా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. వచ్చే నెల నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని ప్రతిపాదించినట్లు చెప్పిందిది. తమ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ విద్వేష రాజకీయాలను తమిళనాడులో అడ్డుకుంటామన్నారు. తమిళనాడుపై హిందీ, సంస్కృత భాషల్ని బలవంతంగా రుద్దడాన్ని అంగీకరించమని హెచ్చరించారు.
ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘జన నాయగన్'(తెలుగులో జన నాయకుడు) అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వవ వహిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ ఇటీవలే విడుదలైంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీని విడుదల చేయనున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన నేపథ్యంలో విజయ్ చివరి చిత్రం ఇదేనంటూ కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.