తమిళ స్టార్ హీరో విజయ్(Vijay).. తమిళగ వెట్రి కళగం పార్టీ (Tamilaga Vetri Kalagam Party) పార్టీ స్థాపించి సంవత్సరం పూర్తి అయింది. నేటితో రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా మహాబలిపురంలో మహానాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) కూడా హాజరకావడం విశేషం. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
1967లో తమిళ రాజకీయాల్లో జరిగిన సంచలనాలు 2026లోనూ జరగనున్నాయని జోస్యం చెప్పారు. త్వరలోనే తమ పార్టీలోకి కీలక నేతల చేరికలు ఉంటాయని విజయ్ వెల్లడించారు. ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రశ్నిస్తే.. తమ పార్టీ నేతలపై ఎక్కడికక్కడ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.. తమ పార్టీ సామాన్యులకే రాజ్యాధికారం కల్పిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం కుదురిందని ఆరోపించారు.