Shraddha Valkar Case: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్యోదంతంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. మే 18న శ్రద్ధ వాకర్ ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా హత్య చేసి.. 35 ముక్కలుగా నరికి.. రోజుకొక ప్రాంతంలో ఒక్కో అవయవాన్ని పడేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో జూన్ నెలలో ఈస్ట్ ఢిల్లీ పోలీసులకు ముక్కలుగా నరకబడిన ఓ తల లభ్యమైంది. కానీ.. అది ఎవరిది ? ఆ హత్య ఎవరు చేశారన్నది ప్రశ్నార్థకమైంది. ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. మెహ్రౌలీ తో పాటు.. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో లభ్యమైన మృతదేహం భాగాలతో కేసు విచారణ మొదలైంది. ఇంతలో తమ కూతురు కనిపించడం లేదంటూ.. శ్రద్ధ వాకర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కేసు విచారణకు ప్లస్ పాయింట్ అయింది.
మరోవైపు ఆ ఇంటి నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. శ్రద్ధ లివ్ ఇన్ పార్టనర్ అప్తాబ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు నివాసమున్న ఇంటిని పరిశీలించిన పోలీసులు షాకయ్యారు. శ్రద్ధ హత్యానంతరం ఆమె శరీర భాగాలను ఉంచేందుకు అఫ్తాబ్ 300 లీటర్ల ఫ్రిడ్జ్ ను కొనుగోలు చేశాడు. ఆమె ముఖాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు కాల్చేశాడు. చేసిన క్రైం తాలూక ఆనవాళ్లు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇంటర్నెట్ లో చూసి.. సల్ఫర్ హైపోకెలోరిక్ యాసిడ్ ను వాడాడు. ఆ తర్వాత మరో అమ్మాయితో పరిచయం పెంచుకుని, ఇంటికి పిలిపించుకుని రొమాన్స్ చేశాడు. అప్పటికి శ్రద్ధ శరీర భాగాలు ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి.
ఓ పక్క శరీరభాగాలు ఫ్రిడ్జ్ లో ఉండగానే.. అఫ్తాబ్ అందులోనే ఫుడ్, డ్రింక్స్ స్టోర్ చేసి వాటిని తిని, తాగేవాడని పోలీసుల విచారణలో తేలింది. అఫ్తాబ్ కు మరో యువతితో సంబంధం ఉందని అనుమానించి.. తనను పెళ్లి చేసుకోవాలని అడగడమే శ్రద్ధ ప్రాణాలు తీసింది. అంతకుముందే శ్రద్ధకు అతని ప్రవర్తన నచ్చక విడిపోవాలనుకున్న వీలుకాలేదని ఇద్దరికి సంయుక్తంగా ఉన్న స్నేహితులు చెబుతున్నారు. ఈ కేసులో ఇంకెన్ని దారుణ నిజాలు బయటికి వస్తాయో చూడాలి.