Mandous Cyclone: మాండస్ తుపాను తీరం దాటినా దాని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఇంకా చెప్పాలంటే తీరం దాటిన అనంతరం జోరు వానలు మొదలయ్యాయి. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు తమిళనాడులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో చాలా చోట్ల నీరు చేరి జనం అవస్థలు పడుతున్నారు. ఏపీలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నదులు, వాగులు ఉద్ధృతికి కాజ్‌వేలు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచి అవస్థలు పడుతున్నారు.
ఇక తమిళనాడు విషయానికి వస్తే… మాండస్ ఎఫెక్ట్ ఏపీని మించి తమిళనాడుపై కనిపిస్తుంది. తుఫాన్ ప్రభావంతో చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు గంటకి 80 కిమీ వేగంతో గాలులు వీయడంతో భారీగా చెట్లు, కరెంట్ స్థంబాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడి వేర్వేరు చోట్ల ఆరుగురు మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
ఇక తీరం వెంట గాలులకు అలల తాకిడికి బీచ్ ధ్వంసం కాగా.. తీరం వెంట ఉన్న 150 మత్య్సకార పడవలు కూడా ధ్వంసమయ్యాయి. ఇప్పటికే సీఎం స్టాలిన్, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక, ఈ రోజు కూడా ఉత్తర, దక్షణ కోస్తాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురవనుండగా.. రాయలసీమలో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.