Homeనేషనల్India Bloc Protest : జ్ఞానేశ్‌.. ఇట్స్‌ డన్‌ బ్రో..‘టైం టు రిజైన్‌’ అంటూ రాహుల్‌...

India Bloc Protest : జ్ఞానేశ్‌.. ఇట్స్‌ డన్‌ బ్రో..‘టైం టు రిజైన్‌’ అంటూ రాహుల్‌ గాంధీ ప్లకార్డు

  • సీఈసీ రాజీనామా డిమాండ్‌తో ఇండియా కూటమి భారీ ర్యాలీ
  • ఈసీ కార్యాలయం వైపు దూసుకెళ్లిన విపక్ష నేతలు
  • బారికేడ్లపైకి ఎక్కిన రాహుల్‌, ప్రియాంక
  • ‘ఓట్‌ చోర్‌.. గద్దీ చోడ్‌’ అంటూ నినాదాలు
  • రాహుల్‌, ప్రియాంక సహా పలువురు నేతల అరెస్టు
  • ఈసీ కార్యాలయం ఎదుట యువజన కాంగ్రెస్ నిరసన
  • హైదరాబాద్‌లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

రాహుల్ పోరాటంతో కేంద్రంలో వణుకు
ఎస్‌ఐఆర్‌ రద్దు కోసం తుదివరకు పోరాటం
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి
రాహుల్‌ అరెస్టును ఖండించిన సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

రాహుల్‌ అరెస్టు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టులా?
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఓటు హక్కు పరిరక్షణకు రెండో స్వాతంత్య్ర పోరాటం
కాంగ్రెస్ ఎంపీల ఫోరం రాష్ర్ట కన్వీనర్ మల్లు రవి

  • వరుస ఓటములతో నిరాశలో విపక్ష కూటమి: కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌
  • ఓటు జాబితా శుద్ధిపై కాంగ్రెస్‌ గగ్గోలు
  • నాడు బోగస్‌ ఓట్ల ఏరివేత కోరి.. నేడు అడ్డుకుంటోంది
  • ఫారమ్‌ 6, 7తో వెంటనే ఓట్లు తొలగించరు.. విచారణ తర్వాతే నిర్ణయం
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
  • రాజ్యాంగ సంస్థలపై రాహుల్‌ నిరాధార ఆరోపణలు : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 6(తెలుగుప్రభ): కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి మంగళవారం దేశ రాజధానిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. పార్లమెంట్‌ మకర ద్వారం నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వాచన్‌ సదన్‌’ వరకు చేపట్టిన ఈ మార్చ్‌లో విపక్ష ఎంపీలు, అగ్రనేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “జ్ఞానేశ్‌.. ఇట్స్‌ డన్‌.. బ్రో.. టైం టు రిజైన్‌” అని రాసిన ప్లకార్డును కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు “ఓట్‌ చోర్‌.. గద్దీ చోడ్‌” అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఫారం 6 దరఖాస్తుల్లో మార్పులు చేసి ఓటర్లను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తున్న విపక్షాలు ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఆందోళన చేపట్టాయి.

బారికేడ్ల వద్ద ఉద్రిక్తత
పార్లమెంట్‌ మకర ద్వారం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆకాశవాణి భవన్‌ వైపు చేరుకోగానే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి విపక్ష నేతలను అడ్డుకున్నారు. దీంతో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే తదితరులు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం రాహుల్‌ గాంధీ, అభిషేక్‌ బెనర్జీ తదితరులు బారికేడ్లపైకి ఎక్కారు. ఒక బారికేడుపై నిలబడి రాహుల్‌ జాతీయ జెండాను ఊపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు నిర్బంధించారు. విపక్ష నేతలను తరలిస్తున్న బస్సును కార్యకర్తలు అడ్డుకోవడంతో కొద్దిదూరం వెళ్లిన తర్వాత వారిని బస్సు నుంచి బయటకు పంపించారు.

భారీగా పోలీసు బలగాల మోహరింపు
ర్యాలీ నేపథ్యంలో సెంట్రల్‌ ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 3 వేల మంది పోలీసులను మోహరించారు. పార్లమెంట్‌, ఆకాశవాణి భవన్‌, విజయ్‌ చౌక్‌, ఎన్నికల సంఘం కార్యాలయం పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ర్యాలీని నిర్వాచన్‌ సదన్‌ వరకు అనుమతించకుండా పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్‌ గాంధీతో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ప్రియాంకా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. డీఎంకే, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఈ నిరసనలో పాల్గొనలేదు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: విపక్ష నేతలు
ర్యాలీలో పాల్గొన్న విపక్ష నేతలు ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు, ఓట్ల తొలగింపు జరిగాయని వారు ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే.. ఎన్నికల సంఘం స్వతంత్రతను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలను పోలీసులు అడ్డుకోవడంపై విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈసీ కార్యాలయం ఎదుట యువజన కాంగ్రెస్ నిరసన
సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్, అక్టోబర్ 6 (తెలుగుప్రభ): భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిని నిరసిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ఎన్నికల కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జక్కిడి శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల ఓట్లను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తొలగించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ ఆదేశాల మేరకు జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోనూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని శివచరణ్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జ్ఞానేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రాహుల్ పోరాటంతో కేంద్రంలో వణుకు: సీఎం రేవంత్
అస్తవ్యస్తంగా మారిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) రద్దు, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీ విశ్రమించదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేస్తున్న పోరాటంతో కేంద్ర ప్రభుత్వం వణికిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు గొడ్డ‌లిపెట్టులా మారిన స‌ర్‌ ర‌ద్దు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ‘ఓటు బచావో.. దేశ్‌ బచావో’ ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో అహింసాయుతంగా ఆందోళన చేస్తున్న రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్‌, ఇండియా కూటమి ఎంపీల అరెస్టును సీఎం తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. స్వాతంత్య్ర ఉద్య‌మ కాలంలోనూ స్వ‌ల్ప కార‌ణాల‌కే మ‌హాత్మా గాంధీ, పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌, స‌ర్దార్ ప‌టేల్ వంటి నేత‌ల‌ను నాటి వ‌ల‌స ప్ర‌భుత్వం అరెస్టు చేసేద‌ని, ఇప్పుడు బ్రిటిష్ జ‌న‌తా పార్టీ (బీజేపీ) కూడా అలానే రాహుల్‌ను అరెస్టు చేసింద‌ని విమ‌ర్శించారు. అక్రమ అరెస్టులు, జైళ్లు, లాఠీఛార్జీలు కాంగ్రెస్‌, ఇండియా కూటమి ఉద్యమాన్ని అణచలేవని, తమ పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఓటు హక్కు, భవిష్యత్తును కాపాడేందుకు ప్రజలు, యువత రాహుల్‌ గాంధీ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం వందేళ్లకు పైగా పోరాడిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్‌ గాంధీ నాయకత్వంలో తుదివరకు పోరాడుతామని సీఎం స్పష్టం చేశారు.

రాహుల్‌ అరెస్టు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు : మహేశ్‌కుమార్‌ గౌడ్‌
ఓట్ల తొలగింపు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో జరిగిన అక్రమాలను ప్రశ్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ముందు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఇండియా కూటమి నేతలను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. దేశంలోని కీలక సమస్యపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న నేతలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం నియంతృత్వ పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీల పట్ల కేంద్రం వ్యవహరించిన తీరును ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలని పిలుపునిచ్చారు. ఓట్ల చోరీ, అక్రమాలపై ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం సరికాదని మహేశ్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

ఓటు హక్కు పరిరక్షణకు రెండో స్వాతంత్య్ర పోరాటం: మల్లు రవి
ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్‌గాంధీ నేతృత్వంలో రెండో స్వాతంత్య్ర పోరాటం సాగుతోందని కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం రాష్ర్ట కన్వీనర్‌ మల్లు రవి అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో అర్హులైన కోట్లాది మంది ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించడం ఆషామాషీ విషయం కాదన్నారు. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్లే లక్ష్యంగా ఈ ప్రక్రియ సాగుతోందని విమర్శించారు. దేశంలో బీజేపీకి, బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లు ఓట్లన్నీ టార్గెట్ చేసేలా ఎస్ఆర్ఐ ప్రక్రియ సాగిందని ఆరోపించారు. ఓటు హక్కును అన్యాయంగా తొలగించడం దేశద్రోహంతో సమానమని వ్యాఖ్యానించారు. ఫారం 6లో మార్పులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని ఈసీ చెప్పడం అబద్ధమని, కోర్టు ఆ మార్పులకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసిందన్నారు. ఓటు హక్కు కోసం పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఓటమిని అంగీకరించండి: బీజేపీ
ఇండియా కూటమి నిరసనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. వరుస ఎన్నికల్లో ఓటములతో విపక్ష కూటమి నిరాశలో ఉందని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విమర్శించారు. కేరళ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఝార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు ఇదే ఎన్నికల వ్యవస్థ ద్వారా గెలిచాయని ఆయన గుర్తుచేశారు. ఓటమిని అంగీకరించకుండా రాజ్యాంగ సంస్థలపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను చౌహాన్‌ సమర్థించారు. మరణించిన వ్యక్తుల పేర్లు, పౌరసత్వానికి సంబంధించిన సమస్యలున్న వారి పేర్లు, ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదైన పేర్లను మాత్రమే తొలగిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియపై అనవసర అనుమానాలు సృష్టించవద్దని సూచించారు. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు కూడా కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీపై విమర్శలు చేశారు. రాజ్యాంగ సంస్థలను

ఆరోపణలు, సమాధానాల మధ్య రాజకీయ వేడి
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌, ఓటర్ల జాబితా సవరణలో అక్రమాల ఆరోపణలతో ఢిల్లీలో జరిగిన ఈ నిరసన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు ఎన్నికల సంఘంపై విపక్షాల ఆరోపణలు, మరోవైపు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బీజేపీ సమర్థించడం.. ఇరువర్గాల మధ్య రాజకీయ వాగ్వాదాన్ని మరింత తీవ్రం చేసింది. ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీని అనుమతించకుండా పోలీసులు అడ్డుకోవడం, బారికేడ్లపైకి నేతలు ఎక్కడం, పలువురిని అదుపులోకి తీసుకోవడంతో నిరసన ఉత్కంఠభరితంగా మారింది.

ఓటు జాబితా శుద్ధిపై కాంగ్రెస్‌ గగ్గోలు: ఎన్.రాంచందర్‌రావు
కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే గుడ్డి ఆరాటంతో దేశంలో అరాచక పరిస్థితులు సృష్టించేందుకు కాంగ్రెస్‌, ఇండీ కూటములు కలిసి కుట్రలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. ఓటు జాబితా శుద్ధిపై కాంగ్రెస్‌ గగ్గోలు పెడుతోందన్నారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కార్యాలయం వంటి రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలు కలిగించేలా కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫారమ్‌ 6, 7 సమర్పించినంత మాత్రాన ఓటు వెంటనే తొలగిపోదని.., ఈఆర్వో విచారణ, సంబంధిత వ్యక్తులకు నోటీసులు, క్షేత్రస్థాయి పరిశీలన, వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పొరపాటున ఓటు తొలగినా అప్పీల్‌ చేసుకునే అవకాశం, తిరిగి ఓటరుగా నమోదు చేసుకునే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. నివాసం మార్చిన వారు, మరణించిన వారు, డూప్లికేట్‌, మల్టిపుల్‌ ఎంట్రీలను సరిచేయడం ఎన్నికల ప్రక్రియలో భాగమని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ నేతలే బోగస్‌, డూప్లికేట్‌ ఓట్లను తొలగించాలని డిమాండ్‌ చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఓటరు జాబితా ప్రక్షాళన జరుగుతుంటే ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయంటూ రాహుల్‌గాంధీ చేస్తున్న ప్రచారం కూడా పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. బిహార్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఏకగ్రీవ నిర్ణయంతోనే జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులపై కాంగ్రెస్‌ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కై రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నాయని విమర్శించారు. అసదుద్దీన్‌ ఒవైసీ ఒత్తిడికి తలొగ్గి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. భారత పౌరుడి ఓటు హక్కును ఎవరూ తొలగించలేరని స్పష్టం చేశారు. అక్రమంగా నమోదైన బోగస్‌, డూప్లికేట్‌ ఓట్లు, మరణించిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఓటరు జాబితా ప్రక్షాళన ప్రజాస్వామ్యానికి అవసరమని అన్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలో బోగస్‌ ఓట్లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటరు జాబితా సవరణకు రాజకీయ పార్టీలు, పౌరులు నిబంధనల ప్రకారం ఫారమ్‌లు సమర్పించే హక్కు ఉందన్నారు. ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తూ బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమని రాంచందర్ రావు హెచ్చరించారు.

రాజ్యాంగ సంస్థలపై రాహుల్‌ నిరాధార ఆరోపణలు : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
రాజ్యాంగబద్ధ సంస్థలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్‌ చేసిన తాజా ఆరోపణలకు ఈసీ ఇచ్చిన వివరణతో ఆయన ప్రచారం చేసిన అంశాల్లో వాస్తవం లేదని తేలిపోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కిషన్ రెడ్డి ఎక్స్‌‌లో పోస్టు చేశారు. చట్టపరమైన వాస్తవాలను తెలుసుకోకుండా, ఆధారాలు పరిశీలించకుండా రాజ్యాంగ సంస్థలపై ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఎన్నికల్లో రాజకీయంగా ప్రతికూల ఫలితాలు వచ్చిన ప్రతిసారీ ఈవీఎంలు, ఎన్నికల సంఘం, ఎస్‌ఐఆర్‌ వంటి అంశాలపై అనుమానాలు వ్యక్తం చేయడం, కాంగ్రెస్‌ గెలిచినప్పుడు మాత్రం అదే వ్యవస్థపై మౌనం వహించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. తాజాగా ఫారం-6 విషయంలోనూ అసత్య ప్రచారానికి తెరతీశారని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా పదేపదే వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్ష నేతకు తగదన్నారు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తిగా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. విదేశాల్లో భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం నుంచి సైనికులను రాజకీయ వివాదాల్లోకి లాగడం వరకు రాహుల్‌ గాంధీ వ్యవహారశైలి ప్రజల్లో నిరాశ కలిగిస్తోందన్నారు. రాజకీయ వైఫల్యాలకు రాజ్యాంగ సంస్థలను బాధ్యులను చేయడం, వాటిపై బురదజల్లి ప్రజల్లో అపనమ్మకం సృష్టించడం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి లక్షణం కాదని స్పష్టం చేశారు. ఇకనైనా కల్పిత కుట్రల వెనుక దాక్కోకుండా రాజకీయ వైఫల్యాలను నిజాయితీగా అంగీకరించి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు బాధ్యత వహించాలని హితవు పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News