న్యూఢిల్లీ, అక్టోబర్ 17: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు పోలీసులు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. శాంతి బాండ్‌లో ఇచ్చిన హామీ ఆధారంగా విడుదల చేసినట్లు పోలీసు వర్గాలు శనివారం వెల్లడించాయి. దీనికి సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
అక్టోబరు 10న సమర్పించిన శాంతి బాండ్ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణతో దీప్కేను శనివారం ఉదయం అరెస్టు చేశారు. అంతకుముందు రోజు ఢిల్లీలోని ఝండేవాలన్ ప్రాంతంలో తన ఇంటి నుంచి బయటకు వచ్చి, కనాట్ ప్లేస్‌లో సీజేపీ తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగా’ నిరసనకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాండ్‌లో ఇచ్చిన హామీ మేరకు ఆయనను విడుదల చేసినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు.

