ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు(Delhi Stampeded) కారణాన్నిపోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. కుంభమేళాకు వెళ్లే రైళ్ల పేర్లలో గందరగోళమే కారణమని తెలిపారు. తొలుత ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు ప్లాట్‌ఫామ్ నెంబర్ 16పైకి వస్తుందని అనౌన్స్‌మెంట్ చేశారన్నారు. అయితే అప్పటికే 14వ ఫ్లాట్‌ఫామ్‌పై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఉందని.. దీంతో తాము ఎక్కాల్సిన రైలు అదే అని కొందరు ప్రయాణికులు అక్కడికి చేరుకున్నారని చెప్పుకొచ్చారు. ఈలోపు అనౌన్స్‌మెంట్‌లో 16వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు ఉందని అనౌన్స్‌మెంట్ వచ్చిందన్నారు.
దాంతో ఒక్కసారిగా వందల మంది ప్లాట్‌ఫామ్ నెంబర్ 16 వైపు పరుగులు పెట్టారని.. అప్పటికే 12,13, 14 ప్లాట్‌ఫారంలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయన్నారు. దాంతో ప్రయాణికుల హడావిడితో తొక్కిసలాట జరిందని వెల్లడించారు. అంతమంది జనాభాను కంట్రోల్ చేయడం అధికారుల వల్ల కూడా కాలేదని పేర్కొన్నారు. కాగా శనివారం రాత్రి 10 గంటల సమయంలో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతులకు రైల్వేశాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.