న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13 (తెలుగుప్రభ) : హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన 1948 నాటి పరిణామాల నేపథ్యంలో రచయిత్రి జీనత్ ఖాన్ రాసిన చారిత్రక నవల ‘ది సైరెన్స్ ఆఫ్ సెప్టెంబర్’ తాజాగా పెంగ్విన్ ప్రచురణ ద్వారా వెలువడింది. వాస్తవ, కల్పిత పాత్రలతో అప్పటి హైదరాబాద్ సామాజిక, రాజకీయ పరిస్థితులను ఈ నవల ఆవిష్కరిస్తుంది. 2017లో ముంబయిలోని సముద్రతీర రహదారిపై నడుస్తున్న సమయంలో హైదరాబాద్ విలీనాన్ని ఇతివృత్తంగా తీసుకుని నవల రాయాలన్న ఆలోచన వచ్చిందని జీనత్ ఖాన్ తెలిపారు.
1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ‘ఆపరేషన్ పోలో’కు దారితీసిన పరిణామాలను ఓడిపోయిన వర్గం కోణంలో చెప్పే ప్రయత్నం చేశానన్నారు. నవల కథానాయిక ఫరిష్తె 15 ఏళ్ల సంపన్న కుటుంబానికి చెందిన యువతి. రాజకీయ కుట్రలు, అంతర్జాతీయ గూఢచర్యం, ప్రేమ వంటి పరిణామాల మధ్య ఆమె జీవితం సాగుతుండగా.. హైదరాబాద్ సంస్థాన ప్రపంచం క్రమంగా కుప్పకూలుతుంది. 1948లో యువతులకు పరిమిత స్వేచ్ఛ ఉండటంతో మహిళా కోణంలో చారిత్రక నవల రాయడం సవాలుగా మారిందని రచయిత్రి పేర్కొన్నారు. ఈ నవల కోసం 1946–48 నాటి వార్తాపత్రికలు, పుస్తకాలు, జీవిత చరిత్రలు, జ్ఞాపకాలు, ప్రత్యక్ష అనుభవ కథనాలను పరిశీలించడంతో పాటు 1940ల జీవనశైలిని ప్రతిబింబించే సినిమాలు, దృశ్యాలను అధ్యయనం చేసినట్లు జీనత్ ఖాన్ తెలిపారు.

