Homeనేషనల్Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్‌ హక్కును నిరాకరించలేం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్‌ హక్కును నిరాకరించలేం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • వయసు ఆధారంగా ఆంక్షలు విధించడం సరికాదు
  • చిన్నారుల రక్షణకు ‘చైల్డ్‌ మోడ్‌’ అమలు చేయాలి.. కేంద్రానికి సూచన

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 17 : ఇంటర్నెట్‌ వినియోగించే హక్కు పెద్దలతోపాటు పిల్లలకూ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లల ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా వయసు ఆధారంగా ఇంటర్నెట్‌ వినియోగంపై ఆంక్షలు విధించడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. ఇటువంటి పరిమితులు విధిస్తే చిన్నారులు ఇంటర్నెట్‌ను ఉపయోగించేందుకు చట్టవిరుద్ధమైన మార్గాలను ఆశ్రయించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆన్‌లైన్‌లో ప్రలోభాలు, బెదిరింపులు లేదా వేధింపులు ఎదురైనప్పుడు, వాటిని బయటపెడితే ఇబ్బందులు వస్తాయనే భయంతో పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టే పరిస్థితి ఏర్పడవచ్చని అభిప్రాయపడింది. జస్టిస్‌ జె.బి. పర్దివాలా, జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లల భద్రత, ఇంటర్నెట్‌ వినియోగ స్వేచ్ఛ పరస్పరం విరుద్ధమైన అంశాలు కావని, రెండింటినీ సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆలోచనల వ్యక్తీకరణకు, సృజనాత్మకతకు, సమాచార మార్పిడికి ఇంటర్నెట్‌ ఒక ముఖ్యమైన వేదికగా మారిందని తెలిపింది. అందువల్ల పిల్లలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని పూర్తిగా నిరాకరించడం సరైన పరిష్కారం కాదని స్పష్టం చేసింది.

- Advertisement -

మారుమూల ప్రాంతాల పిల్లలకు ఇంటర్నెట్‌ కీలకం
ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నివసించే పిల్లలకు ఇంటర్నెట్‌ సమాచారాన్ని పొందేందుకు కీలకమైన వనరుగా ఉపయోగపడుతోందని న్యాయస్థానం పేర్కొంది. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ఇతరులతో అనుసంధానం కావడానికి, ఇంటి నుంచే వివిధ అంశాలను నేర్చుకోవడానికి ఆన్‌లైన్‌ వేదికలు దోహదపడుతున్నాయని వివరించింది. అయితే, హానికరమైన కంటెంట్‌ను గుర్తించి తొలగించడంలో సోషల్‌ మీడియా సంస్థలు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల పిల్లలకు ఇంటర్నెట్‌ ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యకు పరిష్కారంగా చిన్నారులను పూర్తిగా సోషల్‌ మీడియాకు దూరం చేయడం సరికాదని అభిప్రాయపడింది. పిల్లల ఆన్‌లైన్‌ భద్రతను పెంచే చర్యలు తీసుకోవడమే సముచితమని సూచించింది.

చిన్నారుల ఖాతాలకు ప్రత్యేక ‘చైల్డ్‌ మోడ్‌’
సోషల్‌ మీడియా వేదికల్లో పిల్లల ఖాతాలను మరింత భద్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా ‘చైల్డ్‌ మోడ్‌’ను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని ధర్మాసనం సూచించింది. పిల్లలకు అనువైన భద్రతా నియంత్రణలు, రక్షణాత్మక సదుపాయాలను యాప్‌లు అందించడం ద్వారా వారి ఇంటర్నెట్‌ వినియోగాన్ని సురక్షితంగా మార్చవచ్చని పేర్కొంది. అదే సమయంలో, చిన్నారులకు సంబంధించిన లైంగిక వేధింపుల కంటెంట్‌ను సోషల్‌ మీడియా వేదికల నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇటువంటి కంటెంట్‌ ఆన్‌లైన్‌లో కొనసాగకుండా సమర్థవంతమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. పిల్లల ఇంటర్నెట్‌ వినియోగంపై సంపూర్ణ నిషేధాలకంటే, సురక్షితమైన డిజిటల్‌ వాతావరణాన్ని కల్పించడం, సోషల్‌ మీడియా సంస్థల బాధ్యతను పెంచడం, హానికరమైన కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవడం ముఖ్యమని ధర్మాసనం సూచించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News