PM’s law jab at Congress: కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని నాట్యం చేస్తున్నామని చెప్పుకునేవారే దాన్ని తొక్కిపట్టారని, అణచివేతకు సంబంధించిన చట్టాలను దశాబ్దాల పాటు అమలు చేశారని ఆరోపించారు. ఢిల్లీలో ఆదివారం రెండు కీలక రహదారి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన రెండు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని, తన ప్రసంగంలో ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులను ఉదహరిస్తూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. “మన పారిశుద్ధ్య కార్మికులు పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కానీ గత ప్రభుత్వాలు వారిని బానిసల మాదిరిగా చూశాయి. రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని నాట్యం చేసేవారు దానిని ఎలా తొక్కారో, బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఎలా ద్రోహం చేశారో నేను మీకు చెబుతున్నాను.”
ALSO READ: PM Modi: రూ. 11,000 కోట్లతో రెండు హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
చెప్పకుండా పనికి రాకపోతే జైలు..
“పారిశుద్ధ్య కార్మికుల కోసం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో ఒక ప్రమాదకరమైన చట్టం ఉంది. దాని ప్రకారం ఒక పారిశుద్ధ్య కార్మికుడు ముందుగా తెలియజేయకుండా పనికి రాకపోతే ఒక నెల జైలు శిక్ష విధించవచ్చు. చిన్న పొరపాటుకు జైలులో పెడతారా? ఇప్పుడు వారు సామాజిక న్యాయం గురించి పెద్దగా మాట్లాడుతున్నారు. ఈ చట్టాలను నేను మాత్రమే తొలగిస్తున్నాను” అని ప్రధాని అన్నారు.
ALSO READ: PM Modi : ఎర్రకోట నుంచి సంఘ్‌కు జై.. స్వాతంత్య్ర స్ఫూర్తికి ద్రోహమన్న విపక్షాలు!
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ప్రభుత్వాలు ఢిల్లీని అగాధంలోకి నెట్టాయని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ అగాధాన్ని పూడ్చి, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


