OPS Quits BJP Alliance: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్నాడీఎంకే సీనియర్ నేత ఓ. పన్నీర్‌సెల్వం (ఓపీఎస్), బీజేపీతో తమ కూటమి సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓపీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తమిళనాడులో బీజేపీకి బలమైన పునాది లేకపోయినా, అన్నాడీఎంకేలో ఏర్పడిన చీలిక కారణంగా ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు విడిపోయినప్పుడు, బీజేపీ ఓపీఎస్‌కు మద్దతుగా నిలిచింది. దీంతో ఓపీఎస్ వర్గం బీజేపీ కూటమిలో భాగంగా కొనసాగింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పు ఈపీఎస్ (ఎడప్పాడి పళనిస్వామి) వర్గానికే అనుకూలంగా రావడంతో, ఓపీఎస్‌కు అన్నాడీఎంకేలో నాయకత్వ స్థానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఈపీఎస్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు మొగ్గు చూపింది.
తాజాగా, ఓపీఎస్ బీజేపీ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. అన్నాడీఎంకేను తిరిగి ఏకం చేయడమే తన ప్రాధాన్యమని, అందుకోసం ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) లేదా ఇతర ద్రవిడ పార్టీలతో ఓపీఎస్ చేతులు కలుపుతారా అనే చర్చ ఇప్పుడు మొదలైంది.
ఈ పరిణామం బీజేపీకి స్వల్ప ఎదురుదెబ్బగా భావించవచ్చు. తమిళనాడులో బలపడాలని చూస్తున్న బీజేపీకి, ఒక బలమైన ద్రవిడ నేత దూరం కావడం కొంత ప్రభావం చూపవచ్చు. రాబోయే ఎన్నికల్లో ఓపీఎస్ ఒంటరిగా పోటీ చేస్తారా లేదా కొత్త కూటమిని ఏర్పాటు చేస్తారా అనేది వేచి చూడాలి.
అదే కారణమా?
ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమిళనాడుకు విచ్చేసినప్పుడు ఆయనను కలిసే అవకాశం పన్నీర్ సెల్వంకు రాలేదు. దీంతో ఆయన మనస్తాపం చెందినట్లు సమాచారం. ఇక తాజాగా హోంమంత్రి అమిత్ షాను కలిసే అతిథుల జాబితాలోనూ ఓపీఎస్ పేరు లేదు. దీంతో కూటమి నుంచి వైదొలిగి తన గౌరవం కాపాడుకోవడమే ముఖ్యమని పన్నీర్ సెల్వం భావించినట్లు సమాచారం.


