Jail Sentence to Teacher: విద్యార్థులు తప్పు చేస్తే సున్నితంగా మందలించి వారు మంచి బాటలో నడిచేలా ప్రోత్సహించాల్సిన గురువులు సహనం కోల్పోతున్నారు. చిన్నపాటి పొరపాట్లకే విచక్షణారహితంగా దాడి చేసి వారి బాల్యాన్ని చిదిమేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఓ విద్యార్థిని చెంపదెబ్బ కొట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో కోర్టు ఉపాధ్యాయురాలికి శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/progress-in-the-koti-shooting-case/
2020లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 9వ తరగతి విద్యార్థినిని చెంపదెబ్బ కొట్టి, చెవిపోటుకు కారణమైన టీచర్ పరుల్‌బెన్‌కు కోర్టు మూడేళ్ల మూడు నెలల జైలు శిక్ష, రూ.50,000 జరిమానా విధించింది. సెక్టార్ 28లోని వసంతకున్వర్ బా పాఠశాలలో, హోంవర్క్ చేయనందుకు ఉపాధ్యాయురాలు పరుల్బెన్.. 9వ తరగతి విద్యార్థిని చెంపదెబ్బ కొట్టింది. దీంతో విద్యార్థి చెవికి తీవ్రగాయమై చెవిపోటుకి దారి తీసింది. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. కోర్టులో హాజరు పరిచారు.
విద్యార్థికి పరిహారం
విచారణ జరిపిన న్యాయస్థానం.. ఉపాధ్యాయురాలి దాడి క్రూరత్వానికి దారితీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీచర్ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు అమాయక విద్యార్థిపై శారీరక హింసను ప్రయోగించడం తీవ్రమైన అంశంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయురాలికి 39 నెలల జైలు శిక్ష, రూ. 50,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. విద్యార్థి వినికిడి శక్తిపై తీవ్రంగా ప్రభావం పడటంతో జరిమానాను విద్యార్థికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
Also Read: https://teluguprabha.net/national-news/west-bengal-cm-mamata-banerjee-protests-at-ec-against-sir/
పిల్లలపై హింస సహించబోం..
ఈ మేరకు జస్టిస్ హిమాన్షు చౌదరి తీర్పు వెల్లడిస్తూ.. విద్యార్థిపై టీచర్ పాల్పడిన అధికార దుర్వినియోగం, శారీరక హింస భవిష్యత్తులో ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచే తీవ్రమైన విషయాలని పేర్కొన్నారు. ఈ దాడి “క్రూరత్వం” అని వెల్లడించింది. ఈ సంఘటనను పిల్లల హక్కుల ఉల్లంఘనగా వ్యాఖ్యానించింది. చిన్నారులకు సురక్షితమైన పాఠశాల వాతావరణం అవసరాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. చదువు పేరుతో పిల్లలపై శారీరక వేధింపులను సహించలేమన్న న్యాయమూర్తి.. ఈ శిక్ష ఉపాధ్యాయులకు శక్తివంతమైన సందేశాన్ని పంపుతుందని స్పష్టం చేసింది.

