‘Tie Them Up’ Abhishek Banerjee’s Controversial Call: పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ సందర్భంగా టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓటరు నమోదులో భాగంగా ఎవరైనా పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు (Birth Certificates) అడిగితే, వాటిని తీవ్రంగా ప్రతిఘటించాలని ఆయన పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.
‘కట్టేసి.. సర్టిఫికెట్లు అడగండి’
“స్థానిక బీజేపీ నాయకులు ప్రచారానికి వస్తే, వారిని చుట్టుముట్టి ముందుగా వారి తండ్రి, తాత సర్టిఫికెట్లను చూపించమని అడగండి. వారు ఆ సర్టిఫికెట్లను తీసుకొచ్చే వరకు వారిని ప్రచారానికి అనుమతించవద్దు. వారిని చెట్లకో, స్తంభాలకో కట్టేయండి. అయితే, చేతులు మాత్రం ఎత్తకండి, నేను శాంతిని నమ్ముతాను. సర్టిఫికెట్లు తెచ్చాక విడిచిపెట్టండి. అమిత్ షా (కేంద్ర హోంమంత్రి), మీ ప్రభుత్వం మమ్మల్ని అడుగుతున్న పత్రాలను ముందు మీరు చూపించండి,” అని అభిషేక్ బెనర్జీ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ALSO READ: Justice Abhay: ‘మతం పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు’.. టపాసులు, అజాన్‌పై సుప్రీం మాజీ జడ్జి
ఆందోళనతో ఆత్మహత్య
ఎస్ఐఆర్, జాతీయ పౌర పట్టిక (NRC) అమలు అవుతుందనే భయంతో 57 ఏళ్ల ప్రదీప్ కర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, అభిషేక్ బెనర్జీ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ… కర్ మరణానికి నేరుగా ఎస్‌ఐఆర్, ఎన్‌ఆర్‌సీ భయాలే కారణమని ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వల్లే ఈ భయాందోళన వాతావరణం ఏర్పడిందని, వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తృణమూల్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం, బీజేపీ భయాన్ని వ్యాప్తి చేస్తోందని, ఎన్‌ఆర్‌సీని ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ తమ మద్దతుదారులను ఓటు హక్కుకు దూరం చేసే కుట్ర అని టీఎంసీ ఆరోపిస్తోంది. అయితే, ఎన్నికల సంఘం మాత్రం ఎస్‌ఐఆర్‌లో భాగంగా పుట్టిన సర్టిఫికెట్‌తో పాటు ఆధార్‌తో సహా మొత్తం 12 సహాయక పత్రాలలో ఏదో ఒకటి మాత్రమే అవసరం ఉంటుందని స్పష్టం చేసింది. అయినప్పటికీ, బెంగాల్‌లో ఈ అంశం రాజకీయంగా పెను దుమారాన్ని సృష్టిస్తోంది.


