INDIA BLOC Meeting: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమిష్టి పోరుకు తృణమూల్ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో సోమవారం ఇండియా కూటమి కీలక సమావేశం జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఇండియా కూటమిలో తాము లేమని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇటీవల రాఘవ్ చడ్డాతో సహా పలువురు కీలక ఎంపీలు ఆప్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో ఆప్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.
ఇండియా కూటమి (INDIA Bloc) సమావేశంలో పాల్గొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం ఢిల్లీకి పయనమయ్యారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం, ఆ తర్వాత పార్టీలో తలెత్తిన తీవ్ర అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ఆమె ఈ పర్యటనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రతిపక్షాల భేటీ జరగనుంది.
మమతా బెనర్జీతో పాటు రాజ్యసభ సభ్యుడు డోలా సేన్, సీనియర్ లోక్‌సభ సభ్యుడు కల్యాణ్ బెనర్జీలు ఢిల్లీకి పయనమయ్యారు. అంతకుముందే శనివారం రోజే టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హస్తినకి చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సమావేశంలో పాల్గొనేందుకు మొత్తం 23 విపక్ష పార్టీలు తమ అంగీకారాన్ని తెలిపాయి.
వ్యూహాత్మక అడుగు: ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సుదీర్ఘ రాజకీయ పోరాటానికి, భవిష్యత్ కార్యాచరణకు ఉమ్మడి వ్యూహాన్ని రచించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశమన్నారు.
పార్టీలో సంక్షోభం: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫలితాల తర్వాత టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో కోల్పోయిన పట్టును జాతీయ స్థాయిలో ఇండియా కూటమి మద్దతుతో తిరిగి సాధించడం, పార్టీని కాపాడుకోవడం దీదీ లక్ష్యంగా తెలుస్తోంది. ఈ క్రమలో ఒకవైపు 23 పార్టీలు ఈ సమావేశానికి హాజరవుతుండగా.. కాంగ్రెస్‌తో విభేదాల కారణంగా డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఆప్ సైతం ఇండియా కూటమిలో తాము భాగం కాదని వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.

