Homeనేషనల్Mamata Banerjee: ఎమ్మెల్యే టికెట్‌ కోసం రూ.5 కోట్లు అడిగారు.. టీఎంసీ నేతల సంచలన ఆరోపణలు..!

Mamata Banerjee: ఎమ్మెల్యే టికెట్‌ కోసం రూ.5 కోట్లు అడిగారు.. టీఎంసీ నేతల సంచలన ఆరోపణలు..!

Tmc Internal Rift After West Bengal Election Defeat: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఘోర పరాజయం పాలై బీజేపీ అక్కడ తొలిసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఓటమి దెబ్బ నుంచి ఇంకా కోలుకోక ముందే ఇప్పుడా పార్టీలో ముసలం ముంచుకొస్తోంది. ప్రధానంగా ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీలకు వ్యతిరేకంగా పలువురు నేతలు వ్యతిరేక గళం విప్పుతున్నారు. మమతా బెనర్జీ వైఖరి వల్లే పార్టీ ఓటమి పాలైందని పార్టీలోని కొందరు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇలా బహిరంగ ఆరోపణలు చేసిన వారి పట్ల టీఎంసీ అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుంది. వీరంతా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, క్రమశిక్షణ ఉల్లంఘించారని పార్టీ సస్పెండ్‌ చేసింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ముగ్గురు టీఎంసీ అధికార ప్రతినిధుల్ని టీఎంసీ ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. వీరిని సస్పెండ్ చేయడం ద్వారా తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి స్పష్టమైన సందేశాన్ని పంపింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/vijay-gives-up-trichy-east/

పార్టీ లైన్‌ దాటిన వారిపై సస్పెన్షన్‌ వేటు..

కాగా, టీఎంసీ అధికార ప్రతినిధి రిజు దత్తా.. ఎన్నికల క్యాంపెయిన్‌లో తాను బీజేపీని, సువేందు అధికారిని ఉద్దేశిస్తూ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. పార్టీ ఒత్తిడి వల్లే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని ఎక్స్ హ్యాండిల్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. దీంతో, టీఎంసీ ఆయన్ను క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుకావాల్సిందిగా కోరింది. అయితే, దత్తా మాత్రం టీఎంసీ నోటీసులను పట్టించుకోలేదు. దీంతో, అతడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇక మాజీ క్రికెటర్ మనోజ్ తిరవారీ సైతం టీఎంసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే టికెట్ పొందడానికి ప్రతీ అభ్యర్థి నుంచి టీఎంసీ రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అయితే, తాను మాత్రం ఆ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించినట్లు తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను పార్టీ అధిష్టానం కొట్టిపారేసింది. మరోవైపు, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనే కారణంతో పార్టీ అధికార ప్రతినిధులైన కోహినూర్ మజుందార్, కార్తీక్ ఘోష్‌‌లను కూడా టీఎంసీ సస్పెండ్ చేసింది. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీని కలవడానికి గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చేదని కోహినూర్ మజుందార్ ఆరోపించగా.. పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి అభిషేక్ బెనర్జీ కారణమని మాల్దాకు చెందిన సీనియర్ టీఎంసీ నాయకుడు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో, పార్టీ వారిద్దరినీ పార్టీ సస్పెండ్‌ చేసింది. ఇక, మమతా బెనర్జీ, అభిషేక్‌ బెనర్జీ వ్యవహార శైలి కారణంగానే ఓడిపోయామని కృష్ణేందు నారాయణ చౌదరి విమర్శించారు. పాపియా ఘోష్ కూడా పార్టీ నాయకత్వంపై ఆరోపణలు చేయడంతో టీఎంసీ వారిపై సస్పెన్షన్‌ వేటు వేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News